Online Rummy: ఆన్‌లైన్‌ రమ్మీ ఆడితే ఇక జైలుకే..

ABN , First Publish Date - 2023-04-12T09:06:56+05:30 IST

ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) నిషేధ బిల్లుకు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆమోదం తెలపడంతో రాష్ట్రవ్యాప్తంగా

Online Rummy: ఆన్‌లైన్‌ రమ్మీ ఆడితే ఇక జైలుకే..

- అమల్లోకి వచ్చిన నిషేధ చట్టం

- రూ.20లక్షల వరకూ జరిమానా

- ప్రకటనలు చేసినా యేడాది జైలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) నిషేధ బిల్లుకు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆమోదం తెలపడంతో రాష్ట్రవ్యాప్తంగా చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ కొత్త చట్టం ద్వారా ఆన్‌లైన్‌లో జూదమాడినా, కానుకలు, నగదు బహుమతుల కోసం ఆన్‌లైన్‌ రమ్మీ ఆడినా 3 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించేందుకు, లేదా ఒకే సమయంలో జరిమానా, జైలు శిక్ష విధించేందుకు అవకాశముంది. ఇక ఆన్‌లైన్‌ రమ్మీ ఇతర రకాలకు చెందిన జూదాలకు సంబంధించి ప్రకటనలు వెలువరించేవారికి యేడాది జైలు శిక్ష లేదా రూ.5లక్షల జరిమానా విధిస్తారు. ఈ జూదాలకు సంబంధించిన యాప్‌లను ఏకమొత్తంగా అందించే సంస్థలు, వ్యక్తులకు కూడా మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.10లక్షల జరిమానా విధిస్తారు. ఒకసారి ఈ రెండు రకాల శిక్షలు అనుభవించినవారు మళ్ళీ ఆన్‌లైన్‌లో జూదాలు ఆడేందుకు యాప్‌లు సమకూర్చినా, లేదా జూదాలు నిర్వహించి కానుకలు, నగదులు అందించినా ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20లక్షల వరకూ జరిమానా విధిస్తారు. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి రాష్ట్ర పోలీసులు తీవ్ర నిఘా వేయనున్నారు.

నిషేధ చట్టంపై ఈ-గేమింగ్‌ సమాఖ్య అప్పీలు...

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ నిషేధ చట్టాన్ని అమలు చేయడంపై అప్పీలుకు వెళ్ళనున్నట్లు ఈ-గేమింగ్‌(E-Gaming) సమాఖ్య కార్యదర్శి మలాయ్‌కుమార్‌ శుక్లా, ఆలిండియా గేమింగ్‌ ఈసీఓ రోలాండ్‌ లేండర్స్‌ సంయుక్తంగా ఓ ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం అమలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈచట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట అప్పీలుకు వెళతామని చెప్పారు. ఇదివరలో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించేందుకు హైకోర్టు నిరాకరిస్తూ వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసిందన్నారు. ఆ అప్పీలుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు కూడా జారీ చేసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే రాష్ట్రప్రభుత్వం తొందరపడి నిషేధ చట్టం తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-12T09:10:44+05:30 IST