Parliament special session: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సీడబ్ల్యూసీ పట్టు
ABN , First Publish Date - 2023-09-17T14:30:24+05:30 IST
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభవుతున్న నేపథ్యంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని సీడబ్ల్యూసీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ నేత జైరామ్ రమేష్ తెలిపారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) సోమవారం నుంచి ప్రారంభవుతున్న నేపథ్యంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ నేత జైరామ్ రమేష్ ఓ ట్వీట్‌లో తెలిపారు.
కాంగ్రెస్ గత ప్రభుత్వాలు చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. పంచాయతీ రాజ్, నగరపాలికల్లో మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగ సవరణను మే 1989లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ లోక్‌సభలో ప్రవేశపెట్టారని, అది లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో వీగిపోయిందన్నారు. 1993 ఏప్రిల్‌లో ఇదే బిల్లును నాటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టారని, ఉభయసభలు ఆమోదించడంతో అది చట్టమైందని చెప్పారు. ఇప్పుడు పంచాయతీలు, నగరపాలిక సంస్థల్లో 15 లక్షల మంది ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారన్నారు.
పార్లమెంటులో, రాష్ట్రాల చట్టసభల్లో మూడింట ఒక వంతు మహిళా రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లును అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారని, 2010 మార్చి 9న ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ, లోక్‌సభలో చర్చకు రాలేదన్నారు. ''రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులు, ఆమోదం పొందిన బిల్లులకు కాలం చెల్లడం అంటూ ఉండదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ యాక్టివ్‌గా ఉంది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు లోక్‌సభలో కూడా ఆమోదముద్ర వేయాలని కాంగ్రెస్ పార్టీ గత తొమ్మిదేళ్లుగా డిమాండ్ చేస్తోంది'' అని జైరామ్ రమేష్ తెలిపారు.