Share News

Parliament Security: పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు.. సందర్శకుల పాసులు నిలిపివేత

ABN , Publish Date - Dec 13 , 2023 | 09:51 PM

పార్లమెంటులో బుధవారం తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు చేపట్టింది. లోక్‌సభలోకి సందర్శకుల గ్యాలరీ నుంచి ఆగంతకులు లోపలకు దూకి స్మోక్ గ్యాస్ వదలడం, బెంచీలపై దూకుతూ పరుగులు తీయడం ఎంపీలను భయభ్రాంతులను చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.

Parliament Security: పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు.. సందర్శకుల పాసులు నిలిపివేత

న్యూఢిల్లీ: పార్లమెంటులో బుధవారం తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని (Parliament Security breach) కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు చేపట్టింది. లోక్‌సభలోకి సందర్శకుల గ్యాలరీ నుంచి ఆగంతకులు లోపలకు దూకి స్మోక్ గ్యాస్ వదలడం, బెంచీలపై దూకుతూ పరుగులు తీయడం ఎంపీలను భయభ్రాంతులను చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. పార్లమెంటులో జరిగిన పరిణామాలపై దర్యాప్తునకు కేంద్రం, లోక్‌సభ స్పీకర్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు.


నిబంధనల్లో మార్పులు...

పార్లమెంటు భద్రతా నియమాల్లో మార్పులు చేర్పులపై సమీక్షించిన కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భద్రతా నిబంధనల్లో మార్పులుచేసింది. పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక ఎంట్రీకి నిర్ణయించారు. ఎంపీలు, సిబ్బంది, పాత్రికేయులకు వేర్వేరు ఎంట్రీలు ఏర్పాటు చేస్తున్నారు. విజిటర్లను నాలుగో నెంబర్ గేటు నుంచి పంపుతారు. అయితే, కొద్దిరోజుల పాటు గ్యాలరీల్లోకి వెళ్లేందుకు సందర్శకులకు పాసులు ఇవ్వరాదని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పార్లమెంటు కాంప్లెక్స్‌లోకి సందర్శకుల అనుమతులను తక్షణం రద్దు చేశారు. గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లో దూకకుండా గాజు గ్లాసులతో కప్పేసే ఏర్పా్ట్లు చేశారు. విమానాయాశ్రయాలలో వాడే బాడీ స్కాన్ మిషన్లు పార్లమెంటులో ఏర్పాటు చేయాలని, భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.

Updated Date - Dec 13 , 2023 | 09:52 PM