Air India Pee-Gate: మూత్రం పోసింది నేను కాదు.. శంకర్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-13T17:24:53+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా పీ గేట్ (Air India Pee Gate) ఘటనపై నిందితుడు శంకర్ మిశ్రా (Shankar Mishra) సంచలన వ్యాఖ్యలు చేశాడు

Air India Pee-Gate: మూత్రం పోసింది నేను కాదు.. శంకర్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా పీ గేట్ (Air India Pee Gate) ఘటనపై నిందితుడు శంకర్ మిశ్రా (Shankar Mishra) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తోటి ప్రయాణికురాలైన వృద్ధురాలిపై తాను మూత్రం పోసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆమె తనంత తానే పోసుకుందని ఢిల్లీ కోర్టుకు తెలిపాడు.

నిందితుడు శంకర్ మిశ్రాను ఇటీవల బెంగళూరులో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను ఢిల్లీకి తీసుకెళ్లి పాటియాలా హౌస్ కోర్టు (Patiala House Court)లో హాజరు పరిచారు. అతడిని ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే, పోలీసుల అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు ఆయనను 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. తాజాగా, శంకర్ మిశ్రా కస్టడీ కోరుతూ తాజాగా ఢిల్లీ పోలీసులు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సెషన్స్ కోర్టు జారీ చేసిన నోటీసుకు స్పందిస్తూ శంకర్ మిశ్రా పై వ్యాఖ్యలు చేశాడు.

శంకర్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలను అసహ్యకరమైనవిగా పేర్కొన్న న్యాయమూర్తి ఆయన పెట్టుకున్న బెయిలు దరఖాస్తును నాలుగు రోజుల తర్వాత తోసిపుచ్చారు. నిందితుడి అసభ్య ప్రవర్తన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. మహిళపై తాను మూత్ర విసర్జన చేయలేదన్న మిశ్రా వ్యాఖ్యలను బెయిలు పిటిషన్ సందర్బంగా ఆయన తరపు న్యాయవాదులు ప్రస్తావించకపోవడం గమనార్హం.

కాగా, విచారణ సందర్భంగా బాధిత మహిళ మిశ్రాపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. మిశ్రా తరపు వారి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు ఆరోపించారు. మిశ్రా తండ్రి తనకు మెసేజ్ పంపుతూ.. ‘కర్మ అనుభవించక తప్పదని’ హెచ్చరించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన ఆ మెసేజ్‌ను డిలీట్ చేశారన్నారు. వారు తనకు మెసేజ్‌లు పంపుతూ డిలీట్ చేస్తున్నారని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

Updated Date - 2023-01-13T17:27:47+05:30 IST