Pakistan food crisis : గోధుమ పిండి కోసం అల్లాడుతున్న జనం... లారీ వెంట పరుగులు...

ABN , First Publish Date - 2023-01-15T16:14:19+05:30 IST

పాకిస్థాన్ (Pakistan) తీవ్ర ఆహార సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రజలు తమ ప్రధాన ఆహారమైన గోధుమ పిండిని సంపాదించుకోవడం కోసం

Pakistan food crisis : గోధుమ పిండి కోసం అల్లాడుతున్న జనం... లారీ వెంట పరుగులు...
Pakistan

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ (Pakistan) తీవ్ర ఆహార సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రజలు తమ ప్రధాన ఆహారమైన గోధుమ పిండిని సంపాదించుకోవడం కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. గోధుమ పిండిని రవాణా చేస్తున్న ఓ లారీని గుంపులుగా వెంబడిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో కనిపించి, కన్నీరు తెప్పిస్తోంది. ఆ లారీ వెంట చాలా మంది పరుగులు పెడుతున్నట్లు, వారిలో కొందరు బైకులపై వెళ్తున్నట్లు కనిపించింది.

ఈ వీడియోను ప్రొఫెసర్ సజ్జాద్ రజా పోస్ట్ చేశారు. ఆయన నేషనల్ పార్టీ (జమ్మూ-కశ్మీరు గిల్గిట్ బాల్టిస్థాన్ అండ్ లడఖ్) చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ఇది మోటార్‌సైకిల్ ర్యాలీ కాదు. ఒక ప్యాకెట్ గోధుమ పిండిని కొనుక్కోగలమనే ఆశతో గోధుమ పిండి లోడుతో వెళ్తున్న లారీని ప్రజలు వెంబడిస్తున్నారు. పాకిస్థాన్‌లో మనకు భవిష్యత్తు ఏమైనా ఉందా? పాకిస్థాన్‌లో జరుగుతున్నదానికి ఓ చిన్న మచ్చు తునక మాత్రమే ఈ వీడియో’’ అని తెలిపారు.

కొందరు వ్యక్తులు బైకులపైనా, మరికొందరు పరుగులుపెడుతూ ఈ లారీ వెంట వెళ్తున్నట్లు, వారిలో కొందరు డబ్బులు చూపిస్తూ, గోధుమ పిండిని అడుగుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడటంతోపాటు ఆహార పదార్థాల ధరలు పాకిస్థాన్‌లో తారస్థాయికి చేరాయి. 15 కేజీల గోధుమ పిండి ధర రూ.2,050 (పాకిస్థానీ కరెన్సీ) పలుకుతోంది. రెండు వారాల్లో రూ.300 పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వంటగ్యాస్, నిత్యావసర సరుకులు వంటివాటిని అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం, వరదలు వంటివాటి ప్రభావం పాకిస్థాన్‌లో విపరీతంగా కనిపిస్తోంది.

Updated Date - 2023-01-15T16:14:24+05:30 IST