Modi Dussehra celebrations: అభివృద్ధి భారతావని కోసం 10 ప్రతినలు... మోదీ పిలుపు
ABN , First Publish Date - 2023-10-24T21:01:19+05:30 IST
అభివృద్ధిచెందిన భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని, కులతత్వం, ప్రాంతీయతత్వం సమాజంలోని సామరస్యానికి హాని చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డవలప్డ్ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ 10 ప్రతినలు బూనాలని ఆయన పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: అభివృద్ధిచెందిన భారతదేశం (Developed India) కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని, కులతత్వం, ప్రాంతీయతత్వం సమాజంలోని సామరస్యానికి హాని చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డవలప్డ్ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ 10 ప్రతినలు బూనాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ద్వారకలో మంగళవారం అత్యంత ఘనంగా జరిగిన దసరా వేడుకల్లో ప్రధాని ప్రసంగించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, దేశ ప్రజలందరికీ నవరాత్రి, విజయదశమి శుక్షాకాంక్షలని అన్నారు. రావణ దహనం అంటే కేవలం గడ్డిబొమ్మను దహనం చేయడం మాత్రమే కాదని, భరతమాతను కులం, ప్రాంతీయవాదం పేరుతో విడగొట్టాలని చూసే శక్తుల అంశం కూడా అని చెప్పారు. డవలప్డ్ ఇండియా దిశగా ప్రజలంతా 10 ప్రతినలు చేయాలని కోరారు.
10 ప్రతినలు ఇవే..
1.భవిష్యత్ తరాల కోసం నీటిని పొదుపు చేయడం.
2.డిజిటల్ చెల్లింపు వ్యవస్థల వినియోగానికి ప్రజలను సంసిద్ధులను చేయడం.
3.గ్రామాల పరిశుభ్రత పట్ల నిబద్ధత కలిగి ఉండటం.
4.స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు (vocal for local) ప్రాధాన్యత ఇవ్వడం
5. పనిలో నైపుణ్యం, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ
6. ముందు స్వదేశంలో పర్యటించడం, ఆ తర్వాతే ప్రపంచం చుట్టడం.
7.ప్రకృతి వ్యవసాయంపై రైతులను జాగృతం చేయడం
8.రోజువారీ ఆహారంలో మిల్లెట్లను చేర్చడం.
9. ప్రతి ఒక్కరు దేహదారుఢ్యం (personal fitness)పై దృష్టిసారించడం.
10. ఒక్కొక్కరూ కనీసం ఒక్కో పేద కుటుంబం సామాజిక-ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం.