PM Modi: ఎర్రకోట ప్రసంగంలో హామీలపై ప్రధాని మోదీ సమీక్ష
ABN , First Publish Date - 2023-10-07T19:44:25+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఇచ్చిన హామీల ప్రగతిని ఈ సందర్భంగా ప్రధాని సమీక్షించారు. విధివిధానాలను, అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారంనాడు అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట (Red fort) నుంచి చేసిన ప్రసంగంలో ఇచ్చిన హామీల ప్రగతిని ఈ సందర్భంగా ప్రధాని సమీక్షించారు.
ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటి కలను నేరవేర్చుతామని హామీ ఇచ్చారు. బ్యాంకు రుణాలు, వడ్డీలో ఉపశమనం కల్పించేందుకు గృహ రుణంపై వడ్డీ రాయితీ పథకాన్ని తెస్తామని ప్రకటించారు. ఈ హామీలను అమలు చేసేందుకు అవసరమన విధివిధానాలు, అమలు గురించి అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ప్రధాని చర్చించారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌతా, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గృహాలకు సౌర విద్యుత్ పథకం అమలుపైన కూడా అధికారులతో మోదీ సమీక్షించారు.
ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో ప్రధానంగా సిటీల్లో నివసిస్తున్న బలహీన వర్గాల సమస్యలను ప్రస్తావించారు. మధ్యతరగతి ప్రజానీకం సొంత ఇల్లు కలను సాకారం చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇన్‌కమ్ టాక్స్ బ్రాకెట్‌ను రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతామని, ఇందువల్ల జీతాలపై బతికే మధ్యతరగతి వర్గానికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. 2014కు మందు ఇంటర్నెట్ డాటా చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేదని, ఈరోజు ప్రపంచంలోనే అత్యంత చవకగా ఇంటర్నెట్ డాటా అందిస్తున్నామన్నారు. ఇందువల్ల కుటుంబ సేవింగ్స్ పెరిగాయని అన్నారు.