Parliament Building Inauguration : కొత్త పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రకటన.. అదేమిటో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-05-28T13:23:46+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన అనంతరం తొలి ప్రసంగం చేశారు. ప్రతి దేశ అభివృద్ధి ప్రస్థానంలోనూ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన అనంతరం తొలి ప్రసంగం చేశారు. ప్రతి దేశ అభివృద్ధి ప్రస్థానంలోనూ కొన్ని సమయాలు వస్తూ ఉంటాయని, అవి అమరత్వం పొంది శాశ్వతంగా నిలిచిపోతాయని, అటువంటి రోజే మే 28 అని తెలిపారు. భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ సువర్ణ ఘడియల సందర్భంగా భారతీయులందరినీ అభినందిస్తున్నానని తెలిపారు. ఈ అమృత మహోత్సవంలో భారతీయులు తమ ప్రజాస్వామ్యానికి ఈ నూతన పార్లమెంటు భవనాన్ని బహూకరించుకున్నారని తెలిపారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం సర్వమత ప్రార్థనలు జరిగాయన్నారు. భారతీయ ప్రజాస్వామ్యంలో ఈ సువర్ణ ఘడియల సందర్భంగా దేశ ప్రజలందరినీ అభినందిస్తున్నానని చెప్పారు. ఈ నూతన పార్లమెంటు కేవలం ఓ భవనం కాదన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని తెలిపారు. పాత, కొత్తల మేళవింపుతో ఈ భవనాన్ని నిర్మించామన్నారు. నవ భారతం కొత్త పంథాలో దూసుకెళ్తుందన్నారు. భారత దేశం అభివృద్ధి చెందడమంటే, ప్రపంచ అభివృద్ధికి దోహదపడటమని తెలిపారు. కొత్త పార్లమెంటు భవనం ప్రజాస్వామ్య దేవాలయమని పేర్కొన్నారు. ప్రపంచమంతా భారత దేశంవైపు ఆసక్తిగా చూస్తోందన్నారు. కొత్త పార్లమెంటు భవనం భారత దేశ గౌరవాన్ని మరింత పెంచిందన్నారు. ప్రపంచానికి భారత దేశం దృఢ సంకల్పంతో సందేశాన్ని ఇస్తోందన్నారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కీలక ప్రకటన
రానున్న కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మోదీ చెప్పారు. పాత పార్లమెంటు భవనంలో అనేక ఇబ్బందులు ఉండేవని, సభ్యులు కూర్చోవడానికే కాకుండా, సాంకేతిక సమస్యలు కూడా ఉండేవని చెప్పారు. రాబోయే కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని, అందుకు తగినట్లుగానే నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించామని చెప్పారు. కొత్త భవనంలో ఆధునిక వసతులు ఉన్నాయని చెప్పారు.
‘సావర్కర్ సహించరు’
స్వాతంత్ర్యం సిద్ధించిన అమృతకాలం అనంతమైన కలలను, అసంఖ్యాకమైన ఆకాంక్షలను నెరవేర్చే అమృతకాలమని తెలిపారు. 21వ శతాబ్దపు నవ భారతం సమున్నత స్థాయి ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు. బానిసత్వపు మనస్తత్వాన్ని విడిచిపెట్టిందన్నారు. ఈ కృషికి సజీవ చిహ్నంగా నూతన పార్లమెంటు భవనం నిలుస్తోందన్నారు. ‘స్వతంత్ర’ వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్ జయంతి మే 28 అని తెలిపారు. ఆయన చేసిన త్యాగం, ప్రదర్శించిన ధైర్యసాహసాలు, దృఢసంకల్పం నేటికీ మనకు ప్రేరణనిస్తాయని చెప్పారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో బలాన్ని ఇస్తుందన్నారు. ఆయన నిర్భయత్వం, ఆత్మాభిమానం బానిస మనస్తత్వాన్ని సహించవన్నారు.సావర్కర్ ‘కాలాపానీ’ శిక్షను అనుభవించిన అండమాన్ జైలు గదిని సందర్శించిన రోజును తాను ఎన్నటికీ మర్చిపోనని చెప్పారు.
ప్రతి భారతీయునికి గర్వకారణం
నూతన పార్లమెంటు భవనానికి వారసత్వ ఘనత, వాస్తు శిల్ప ఘనత ఉన్నాయని చెప్పారు. దీనిలో కళతోపాటు నైపుణ్యం కూడా ఉందని చెప్పారు. దీనిలో సంస్కృతి, సంప్రదాయాలతోపాటు రాజ్యాంగ గళం కూడా మిళితమైందని తెలిపారు.
రానున్న 25 ఏళ్లలో..
రానున్న 25 ఏళ్లలో భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. ఈ పాతికేళ్లలో భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నారు. విజయం సాధించాలంటే తొలి షరతు విజయవంతమవుతామనే నమ్మకం ఉండటమేనని చెప్పారు. ఈ నూతన పార్లమెంటు భవనం ఈ నమ్మకాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు. అభివృద్ధి చెందిన భారత దేశంగా తీర్చిదిద్దడంలో ఇది నూతన ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి భారతీయుడి కర్తవ్య భావాన్ని మేలుకొలుపుతుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
New Parliament : సాధికారతను సంరక్షించే చోటు.. నూతన పార్లమెంటు భవనంపై మోదీ వ్యాఖ్య..
New Parliament : బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లను రీట్వీట్ చేసిన మోదీ