Narendra Modi: మోదీ సక్సెస్ టిప్స్
ABN , First Publish Date - 2023-01-27T20:04:45+05:30 IST
జీవన ప్రయాణం ఒక్క స్టేషన్ వద్దనే ఆగిపోదని, అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలన్నారు.
న్యూఢిల్లీ: పరీక్షల తర్వాత కూడా జీవితం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) విద్యార్ధులకు సూచించారు. జీవన ప్రయాణం ఒక్క స్టేషన్ వద్దనే ఆగిపోదని, అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలన్నారు. నిరంతరం తోటి విద్యార్ధులతో పోల్చుకుంటూ శాంతిని కోల్పోవద్దన్నారు. సానుకూలంగా ఆలోచించడం ద్వారా మరింత మెరుగైన ప్రదర్శన కనబరచగలరని చెప్పారు. న్యూఢిల్లీ తల్కటోరా స్టేడియంలో ఆరో విడత పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.
కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల కొత్త అవకాశాలు వస్తాయని చెబుతూ ప్రధాని భాషలతో పాటు వారసత్వం, చరిత్ర, సంస్కృతి, నాగరికతల గురించి కూడా అధ్యయనం చేయాలని విద్యార్ధులకు సూచించారు. ఐక్యరాజ్యసమితిలో తమిళ భాష మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆయన భారత దేశంలో అత్యంత ప్రాచీనభాష కలిగి ఉండటంపై గర్వపడాలన్నారు.
నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం విద్యార్ధులకు తప్పనిసరి అని ప్రధాని చెప్పారు. పిల్లలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను ఇవ్వాలని, తద్వారా విజయాలు సాధించేందుకు తోడ్పడాలని ప్రధాని విద్యార్ధుల తల్లిదండ్రులకు సూచించారు.
విజయం కోసం ఉండే ఒత్తిడిని ప్రధాని ప్రస్తావించారు. క్రికెటర్ మైదానంలోకి దిగాక బంతిపైనే దృష్టిపెడతాడు తప్ప గ్యాలరీలో ఉన్న ప్రేక్షకుల అంచనాలపై కాదన్నారు. విద్యార్ధులు కూడా తమ సామర్థ్యాన్ని సరిగా అర్థం చేసుకుని, లక్ష్యం దిశగా దృష్టి సారించాలని సూచించారు.
మొబైల్ ఫోన్లను, ఇతర గ్యాడ్జెట్లను తెలివిగా ఉపయోగించాలని మోదీ సూచించారు. భారత్‌లో కనీసం ఆరుగంటలు గ్యాడ్జట్లకు బానిసలౌతున్నారని, ఇది తగదని ప్రధాని చెప్పారు. దీనివల్ల ఎంతో సమయం వృధా అవుతాయని, శక్తి సామర్థ్యాలు కుంటుబడతాయన్నారు. గ్యాడ్జెట్ల కన్నా విద్యార్థులే తెలివైనవారని, సృజనాత్మకత కలిగిన వారని ప్రధాని చెప్పారు. గ్యాడ్జట్లను పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో క్వాలిటీ సమయం గడిపేందుకు నో టెక్నాలజీ జోన్ అని ఏర్పాటు చేసుకోవాలని మోదీ విద్యార్ధులకు సూచించారు.
తల్లుల నుంచి సమయపాలన నేర్చుకోవాలని ప్రధాని విద్యార్ధులకు సూచించారు. పరీక్షల్లో చీటింగ్ చేయడం కోసం క్రియేటివిటీని వాడటం తగదని, అంతకన్నా సృజనను సరైన మార్గంలో పెడితే అద్భుత విజయాలు వస్తాయన్నారు. షార్ట్‌కట్స్ ద్వారా విజయాలు ఆశించడం తగదన్నారు.
ఐదో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమానికి 15 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా ఈ సారి 38 లక్షల మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 16న ప్రధాని మోదీ ఈ క్యార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.