Kedarnath: పవిత్ర కేదార్‌నాథ్‌లో ఇదేం పని.. భగ్గుమన్న భక్తులు.. పోలీసులు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-07-06T19:17:37+05:30 IST

పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇటీవల ఓ జంట చిత్రీకరించిన లవ్ ప్రపోజల్ వీడియోపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. కాగా పవిత్ర కేదర్‌నాథ్ ఆలయంలో కొంతమంది వీడియోలు చిత్రీకరించడం పట్ల అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీల్స్ చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.

Kedarnath: పవిత్ర కేదార్‌నాథ్‌లో ఇదేం పని.. భగ్గుమన్న భక్తులు.. పోలీసులు ఏం చేశారంటే..

ఉత్తరాఖండ్: పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇటీవల ఓ జంట చిత్రీకరించిన లవ్ ప్రపోజల్ వీడియోపై పెద్ద దుమారమే రేగింది. తాజాగా ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. కాగా పవిత్ర కేదర్‌నాథ్ ఆలయంలో కొంతమంది వీడియోలు చిత్రీకరించడం పట్ల అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీల్స్ చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే పవిత్ర పుణ్య క్షేత్రమైన కేదర్‌నాథ్ ఆలయంలో ఇటీవల ఓ ప్రేమ జంట లవ్ ప్రపోజల్ వీడియో పెద్ద వివాదానికి దారి తీసింది. దీంతో అనేకమంది సదరు జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు. మతపరమైన ప్రదేశాల్లో ఇలాంటి పనులు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఓ మహిళా యూట్యూబర్, ఆమె ప్రియుడు కేదార్‌నాథ్ ఆలయంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక దగ్గర ఆగి దేవుడికి దణ్ణం పెట్టుకుంటున్నారు. కానీ ఇంతలో ఆ యువతి కెమెరామెన్‌కు సైగ చేసింది. అతను ఒక ఉంగరాన్ని ఆమె చేతిలో పెట్టి జరిగేదంతా కెమెరాతో చిత్రీకరిస్తున్నాడు. ఆ యువతి మోకాళ్లపై కూర్చుని ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీంతో సదరు ప్రియుడు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆమె ప్రియుడి చేతికి ఉంగరాన్ని తొడిగింది. ఆ తర్వాత వారిద్దరు కౌగిలించుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఇతరులు సైతం రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో సదరు జంటపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఇది ప్రేమ కూడా కాదని, సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే సదరు జంట ఇలా చేసి ఉంటుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. కాగా కేదర్‌నాథ్ ఆలయంలో ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు. కొన్ని రోజులు క్రితం ఓ మహిళా భక్తురాలు శివలింగంపై డబ్బులు చల్లిన వీడియో కూడా వైరల్‌గా మారింది. దీంతో అప్పుడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడాన్ని కేదర్‌నాథ్ ఆలయ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వీడియోలు చిత్రీకరించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలు భక్తులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొంది. దీంతో స్పందించిన ఉత్తరాఖండ్ పోలీసులు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ మేరకు ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఆలయంలో వీడియోలు, రీల్స్ వంటికి చిత్రీకరించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-07-06T19:25:16+05:30 IST