Shiv Shakti vs Jawahar Point: శివశక్తి పాయింట్ vs జవహర్ పాయింట్.. తెరపైకి మరో కొత్త రాజకీయ వివాదం

ABN , First Publish Date - 2023-08-26T22:27:18+05:30 IST

మన భారతీయ రాజకీయాల గురించి అందరికీ తెలిసిందేగా! తాము చేసిందేమీ లేకపోయినా.. తమ సమక్షంలో ఏదైనా విజయం నమోదైతే మాత్రం, ఆ క్రెడిట్ తీసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటారు. ఆ గొప్పదనం..

Shiv Shakti vs Jawahar Point: శివశక్తి పాయింట్ vs జవహర్ పాయింట్.. తెరపైకి మరో కొత్త రాజకీయ వివాదం

మన భారతీయ రాజకీయాల గురించి అందరికీ తెలిసిందేగా! తాము చేసిందేమీ లేకపోయినా.. తమ సమక్షంలో ఏదైనా విజయం నమోదైతే మాత్రం, ఆ క్రెడిట్ తీసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటారు. ఆ గొప్పదనం తమదేనని చాటి చెప్పుకోవడానికి నానాతంటాలు పడుతుంటారు. అప్పుడు రాజకీయ వివాదాలనేవి తలెత్తుతుంటాయి. ఇప్పుడు చంద్రయాన్-3 వ్యవహారంలోనూ ఒక కొత్త రాజకీయ దుమారం చెలరేగింది. నిజానికి.. ఈ విజయం సాధించింది ఇస్రో శాస్త్రవేత్తలైతే, క్రెడిట్ కోసం మాత్రం రాజకీయ పార్టీలు కొమ్ములు కాస్తున్నాయి. పదండి.. ఆ గొడవేంటో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం..


చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వడంతో.. ఆ ల్యాండింగ్ సైట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ‘శివశక్తి పాయింట్’ అనే పేరు పెట్టారు. ఇదే సమయంలో.. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ అయిన ప్రదేశానికి కూడా ‘తిరంగా పాయింట్’ అనే నామకరణం చేశారు. ఇలా ఆ రెండు ప్రదేశాలకు పేరు పెట్టడమే.. కొత్త వివాదానికి దారితీసింది. ఇక్కడ బీజేపీ వాళ్లు గతాన్ని తవ్వి.. ‘జవహర్ పాయింట్’ అనే విషయాన్ని తెరమీదకి తెచ్చారు. ఇంతకీ ఈ జవహర్ పాయింట్ ఏమిటంటే.. గతంలో చంద్రయాన్-1 క్రాష్ ల్యాండ్ అయిన ల్యాండింగ్ సైట్ పేరు. భారతదేశం 2008 అక్టోబర్ 22వ తేదీన తొలి మూన్ మిషన్‌ని పీఎస్ఎల్‌వీ రాకెట్ సహాయంతో ప్రయోగించింది. ఇది అదే ఏడాదిలో నవంబర్ 14వ తేదీన చంద్రుని ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఆ క్రాష్ ల్యాండ్ ప్రదేశానికే ‘జవహర్ పాయింట్’ అనే పేరు పెట్టడం జరిగింది. నవంబర్ 14న జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు కావడంతో.. క్రాష్ ల్యాండింగ్ సైట్‌కు ‘జవహర్ పాయింట్’ అనే పేరు పెట్టాలని అప్పట్లో ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పుడు ఈ జవహర్ పాయింట్ పేరు విషయంలోనే బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ గొడవ ప్రారంభమైంది. తొలుత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రషీద్ అల్వీ ‘శివశక్తి పాయింట్’పై స్పందిస్తూ.. అసలు ఆ పేరు పెట్టడానికి ప్రధాని మోదీకి అధికారం లేదన్నట్టుగా మాట్లాడారు. చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై కాలుమోపడం గర్వకారణమే కానీ.. చంద్రునికి లేదా శివశక్తి పాయింట్‌కి తామేమీ యజమానులు కాదని పేర్కొన్నారు. శివశక్తి పేరు విని ప్రపంచం నవ్వుకుంటోందన్నారు. ఇందుకు బీజేపీ నాయకుడు షాజాద్ పూనావాలా కౌంటర్ ఇచ్చారు. శివశక్తి పాయింట్, తిరంగా పాయింట్ అనేవి దేశానికి అనుబంధంగా ఉన్నాయని.. ఆ పేర్లతో అల్వీకి సమస్య ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండి ఉంటే.. చంద్రయాన్-2, చంద్రయాన్-3లని పంపేది కాదన్నారు. ఒకవేళ పంపి ఉంటే.. వాటికి ఇందిరా పాయింట్, రాజీవ్ పాయింట్ అనే పేర్లు పెట్టేవారన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇందుకు ధీటుగా బదులిస్తున్నారు.

Updated Date - 2023-08-26T22:27:18+05:30 IST