ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం.. విచారణకు హాజరుకాను: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
ABN , First Publish Date - 2023-11-02T13:08:36+05:30 IST
లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎగ్గొట్టారు. మనీల్యాండరింగ్ కోణంపై ఆరా తీసేందుకు ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎగ్గొట్టారు. మనీల్యాండరింగ్ కోణంపై ఆరా తీసేందుకు ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈడీకి ఆయన లేఖ రాశారు. బీజేపీ అభ్యర్థన మేరకే సమన్లు పంపినట్లు ఆరోపించారు. కీలకమైన 4 రాష్ట్రాల్లో ప్రచారం చేయకుండా తనను అడ్డుకునేందుకే సమన్లు జారీ చేశారని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆప్ అధిష్టానం ఈడీని కోరింది.
కేజ్రీవాల్ నిర్ణయంపై ఈడీ వర్గాలు స్పందించాయి. కేజ్రీవాల్ పంపిన లేఖను ఈడీ పరిశీలిస్తోందని, త్వరలో తాజా సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయని తెలిపాయి. కాగా ఎలా వ్యవహరించాలనేదానిపై ఈడీ సీనియర్ అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈడీ సమన్లు రాజకీయ ప్రేరేపితమని, చట్టవిరుద్ధమంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అధికారులు భావిస్తున్నట్టు అంతర్గత వర్గాల చెబుతున్నట్టు సమాచారం. కాగా కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కాగా నవంబర్ 2న ఉదయం 11 గంటల్లోగా ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలంటూ నోటీసుల్లో అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే.