Droupadi Murmu: 3 కొత్త క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
ABN , Publish Date - Dec 25 , 2023 | 08:05 PM
ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ న్యాయ సంహిత-2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి.
న్యూఢిల్లీ: ఐపీసీ (IPC), సీఆర్‌పీసీ(CrPC), ఎవిడెన్స్ యాక్ట్ (Evidence Act)ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ న్యాయ సంహిత-2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సోమవారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం దాల్చాయి.
బ్రిటిష్ కాలంనాటి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన మూడు బిల్లులు ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మూజువాణి ఓటుతో ఉభయసభల ఆమోదం పొందాయి. క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులను ఉభయసభల్లోనూ ప్రవేశపెట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ బిల్లులతో ప్రజా సంక్షేమం, సేవలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. సంస్కరణలు తీసుకురావాలన్న తమ సంకల్పానికి ఈ బిల్లులు సంకేతమని చెప్పారు. కొత్త చట్టాలు కేవలం శిక్షలు విధించడమే కాకుండా న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించినట్టు చెప్పారు. పేదలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు.