Droupadi Murmu: 75 మందికి జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

ABN , First Publish Date - 2023-09-05T21:16:57+05:30 IST

ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కర్తవ్య కాల్‌లో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం దిశగా శీఘ్రగతిన ముందుకు తీసుకువెళ్లాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2023 సంవత్సరానికి ఎంపిక చేసిన 75 మందికి జాతీయ టీచర్స్ అవార్డులను మంగళవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రదానం చేశారు.

Droupadi Murmu: 75 మందికి జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ: ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కర్తవ్య కాల్‌లో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం దిశగా శీఘ్రగతిన ముందుకు తీసుకువెళ్లాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (National Teachers Day) సందర్భంగా 2023 సంవత్సరానికి ఎంపిక చేసిన 75 మందికి జాతీయ టీచర్స్ అవార్డులను (National Teachers Awards) మంగళవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రదానం చేశారు.


ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, చరకుడు, సుశ్రుతుడు, ఆర్యభట్ట నుంచి చంద్రయాన్-3 వరకూ అన్ని విషయాల మీద టీచర్లు, విద్యార్థులకు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. విద్యార్థులకు చదువును మించి ప్రేమను పంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. టీచర్లు పిల్లలను అభినందించినా, ప్రోత్సహించినా, శిక్షించినా ప్రతీదీ వారు ఆ తర్వాత గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. విద్య కన్నా ప్రేమ పంచడం ముఖ్యమని, మన విద్యా విధానం భారతీయ సంస్కృతిని పెంపొందించేందుకు ఎంతో ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.


కాగా, విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అవార్డు కింద మెరిట్ సర్టిఫికెట్, ఒక సిల్వర్ మెడల్, రూ.50,000 చొప్పున నగదును ప్రదానం చేశారు. టీచర్స్ డే సందర్భంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఆప్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశంలోనే ఉత్తమ టీచర్లను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానిస్తోంది. ఈ ఏడాది నేషనల్ టీచర్స్ అవార్డులను హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ టీచర్లు, స్కిల్ డవలప్‌మెంట్ అండ్ ఎంట్రపెన్యూర్‌షిప్ డిపార్ట్‌మెంట్ టీచర్లకు కూడా విస్తరించారు. 50 మంది స్కూల్ టీచర్లు, హైయర్ ఎడ్యుకేషన్‌కు చెందిన 50 మంది టీచర్లు, స్కిల్ డవలప్‌మెంట్ మినిస్ట్రీ నుంచి 13 మంది టీచర్లకు ఈ ఏడాది అవార్డులు అందుకున్నారు.

Updated Date - 2023-09-05T21:16:57+05:30 IST