Private buses: ఒకేసారి వెయ్యి ప్రైవేటు బస్సులు..! అదేగాని జరిగితే...
ABN , First Publish Date - 2023-03-05T07:46:20+05:30 IST
చెన్నైలో ప్రైవేటు బస్సుల్ని(Private buses) రంగంలోకి దింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రయాణికులకు తగినన్ని ప్రభుత్వ బస్సుల్ని రోడ్డుపైకి
పెరంబూర్(చెన్నై): చెన్నైలో ప్రైవేటు బస్సుల్ని(Private buses) రంగంలోకి దింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రయాణికులకు తగినన్ని ప్రభుత్వ బస్సుల్ని రోడ్డుపైకి దింపేందుకు ఆర్థిక వనరులు సరిపోవని భావిస్తున్న ప్రభుత్వం... ప్రైవేటు వైపు మొగ్గు చూపింది. ఇందులో భాగంగా చెన్నైలో సుమారు వెయ్యి ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. అదే జరిగితే ఎంటీసీ బస్సుల హవా తగ్గే అవకాశముందని, ఇది తమ పొట్టగొట్టడమేనని కార్మిక సంఘాలు మండిపడుతుండగా, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. చెన్నై(Chennai)లో ప్రజావసరాలు తీర్చేలా 625 మార్గాల్లో 3,436 ఎంటీసీ బస్సులు నడుపుతుండగా, సరాసరిన ప్రతిరోజూ 29.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రోపాలిటన్(Metropolitan) కార్పొరేషన్ (ఎంటీసీ) లెక్కల ప్రకారం, రోజుకు ఒక బస్సును 274 కి.మీ మేర నడుపుతున్నారు. బస్సుల మరమ్మతులకు నిర్వహిస్తున్న 31 డిపోల్లో 20,301 మంది పనిచేస్తున్నారు. పూందమల్లి-బ్రాడ్‌వే మార్గంలో మాత్రమే ప్రస్తుతం ఒక ప్రైవేటు బస్సు నడుస్తుండగా, మిగిలిన అన్నీ మార్గాల్లో ప్రభుత్వ బస్సులే నడుస్తున్నాయి. సాధారణ (వైట్ బోర్డ్) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే, విద్యార్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, సినియర్ సిటిజన్లకు రాయితీ తదితరాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చెన్నైలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా రవాణా సేవలు అందడం లేదన్న వాదనలు కూడా వున్నాయి. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంటీసీ సంస్థ బస్సుల సంఖ్యను పెంచలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు బస్సుల్ని అనుమతించాలని రవాణాశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా 2024లో 500 బస్సులు, 2025లో మరో 500 బస్సుల చొప్పున మొత్తం 1,000 ప్రైవేటు బస్సుల్ని కాంట్రాక్టు కింద అనుమతి ఇచ్చేందుకు రవాణా శాఖ సిద్ధమైంది.
ఇది రవాణా శాఖ ప్రైవేటీకరణ లాంటిదే...
- కార్మిక సంఘాలు
చెన్నైలో ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వడంపై రవాణా కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రవాణా శాఖను ప్రైవేటుపరం చేసేలా చేపట్టిన ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఆర్ముగం నయినార్(Armugam Nainar) మాట్లాడుతూ... చెన్నైలో ప్రైవేటు బస్సులు నడిపితే మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న రాయితీలు రద్దవుతాయన్నారు. రవాణా శాఖకు అవసరమైన నిధులు అందజేస్తే కొత్త బస్సులు కొనుగోలు చేయవచ్చని, బస్సుల పెంపుతో ఉద్యోగాలు కూడా పెరిగి నిరుద్యోగులు ఉపాధి పొందే అవకాశముందని తెలిపారు. అలా కాకుండా ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వడమంటే ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లేనన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.