Priyanka Chaturvedi: బీజేపీకి అంత సీన్ లేదు.. మహిళా బిల్లు అంశంపై శివసేన ఎంపీ ధ్వజం
ABN , First Publish Date - 2023-09-24T22:09:18+05:30 IST
ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న సమయంలో.. బీజేపీ పన్నే రాజకీయాలు వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఓటర్లను తమవైపుకు ఆకర్షించేందుకు.. ఏదైనా ఒక అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి, ఆ క్రెడిట్ మొత్తం కొట్టేసేందుకు ప్రయత్నిస్తుంది..
ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న సమయంలో.. బీజేపీ పన్నే రాజకీయాలు వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఓటర్లను తమవైపుకు ఆకర్షించేందుకు.. ఏదైనా ఒక అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి, ఆ క్రెడిట్ మొత్తం కొట్టేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎప్పటినుంచో పట్టించుకోని సమస్యలను ఒక్కసారిగా వెలుగులోకి తెచ్చి, వాటిని పరిష్కరిస్తున్నట్టుగా డప్పు కొట్టుకుంటుంది. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టి, ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే.. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మహిళలను రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పం బీజేపీకి ఏమాత్రం లేదని ప్రియాంక మండిపడ్డారు. బీజేపీకి నిజంగా సంకల్ప బలం ఉండి ఉంటే.. ఈ మహిళా బిల్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు కాకుండా, చాలాకాలం క్రితమే వచ్చేదని చురకలంటించారు. ఓట్లు దండుకోవాలన్న ఉద్దేశంతోనే.. బీజేపీ ఇప్పుడు ఈ బిల్లుని సీన్‌లోకి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీజేపీ నాయకురాలు ఉమాభారతి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ గురించి కూడా ప్రియాంక ప్రస్తావించారు. ‘‘కొన్ని రోజుల క్రితం స్వయంగా ఉమాభారతి మహిళా బిల్లులో ఓబీసీ కోటా గురించి ప్రస్తావించారు. కానీ ఇప్పుడు ఆమె నోరు మూయించేశారనో లేదా ఆమెని తిట్టారనో స్పష్టమవుతోంది’’ అని పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. ఓబీసీ కోటాను పరిగణనలోకి తీసుకుంటే తప్ప బిల్లును అమలు చేయనివ్వబోమని ఉమా భారతి శనివారం పేర్కొన్నారు. తాను దేశ జనాభాలో సగం మందికి (మహిళలు) ప్రాతినిధ్యం వహిస్తున్నానని అన్నారు. అంతకుముందు మంగళవారం.. మహిళా బిల్లుని ప్రవేశపెట్టడంపై ప్రధాని మోదీకి భారతి లేఖ రాశారు. ఈ బిల్లులో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. అయితే.. లోక్‌సభలో మాత్రం ఆమోదం పొందలేదు. ఆ తర్వాత లోయర్‌హౌస్‌లలోనూ దాన్ని పక్కన పెట్టేశారు.