Karnataka Elections: రాహుల్ వినూత్న ప్రచారం...జనంతో మమేకం
ABN , First Publish Date - 2023-05-08T17:09:31+05:30 IST
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ల వరకూ హోరాహోరీ ప్రచారం సాగించారు. ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన సోమవారంనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వినూత్న శైలిలో కర్ణాటకలో ప్రచారం సాగించారు. సామాన్య ప్రజానీకంలో సామాన్యుడిగా మమేకమయ్యారు. బీఎంటీసీ బస్సులో ప్రయాణించారు. కర్ణాటక విజన్‌పై నేరుగా వారితో ముచ్చటించారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ల వరకూ హోరాహోరీ ప్రచారం సాగించారు. బీజేపీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తదితరులు భారీ ర్యాలీలు, మెగా రోడ్‌షోలతో ఊదరగొట్టగా, ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన సోమవారంనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వినూత్న శైలిలో కర్ణాటకలో ప్రచారం సాగించారు. సామాన్య ప్రజానీకంలో సామాన్యుడిగా మమేకమయ్యారు. బీఎంటీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి కర్ణాటకపై ప్రజలకున్న విజన్‌ను అడిగి తెలుసుకున్నారు.
కన్నింగ్హామ్ రోడ్డులోని 'కేఫ్ కాఫీ డే' షాపులో రాహుల్ ఒక కప్పు తేనీరు సేవించారు. అనంతరం బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సు స్టాప్‌కు దగ్గర్లో పలువురు కాలేజీ విద్యార్థులు, మహిళా ఉద్యోగినులతో సంభాషించారు. ఆ వెంటనే బీఎంటీసీ బస్సులో ప్రయాణించారు. పలువురు ప్రయాణికులు రాహుల్‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.
స్కూటీ ప్రయాణం..
ఆదివారం సైతం రాహుల్ పలువురు అంసంఘటిత రంగాలకు చెందిన డాంజో, స్విగ్గీ, జొమోటో, బ్లికింట్, ఎయిర్‌లైన్స్ హోటల్ డెలివరీ వర్కర్లను కలుసుకుని వారితో ముఖాముఖీ సాగించారు. డెలివరీ వర్కర్ల కోసం సంక్షోమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానానికి అనుగుణంగా పలువురు డెలివరీ బాయ్స్‌తో రాహుల్ ముచ్చటించారు. వారి జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చుక్కలనంటుతున్న ధరలు వంటి అంశాలపై అడిగి తెలుసుకున్నారు. డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటీలో ప్రయాణం సాగించారు. గతంలో కూడా రాహుల్ గాంధీ జనంలోకి వెళ్లి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. ''భారత్ జోడో యాత్ర'' ద్వారా మరింతగా జనంలోకి వెళ్లారు.
విద్యార్థులతో పుష్-అప్
రాహుల్ గాంధీ 2021 మర్చి 2న తమిళనాడులోని పాఠశాల విద్యార్థులను కలుసుకుని, వారితో కలిసి పుష్ అప్స్ చేశారు. ఫిబ్రవరి 24న కొల్లాంలో పర్యటిస్తూ స్థానిక మత్స్యకారులను కలుసుకున్నారు. వారి జీవితాలను అర్ధం చేసుకునే క్రమంలో వారితో కలిసి చేపల వల విసురుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పడవలో ప్రయాణిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. 2022 సెప్టెంబర్ 19న కేరళలోని పున్నమద లేక్‌లో జరిగిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్‌లో పాల్గొని, బేట్ రేస్‌లో పాల్గొన్నారు. 2022 అక్టోబర్ 21న ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలో అడుగుపెడుతూ ఒక పిల్లవాడిని భుజాలపై ఎత్తుకుని స్వీట్లు అందిస్తూ ఉల్లాసంగా ముందుకు సాగారు.