Rahul Gandhi: ఇండియా vs భారత్ వివాదం.. దేశం పేరు మార్పుపై కేంద్రానికి రాహుల్ గాంధీ చురకలు
ABN , First Publish Date - 2023-09-11T15:14:39+05:30 IST
గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించి ఉండటంతో..
గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించి ఉండటంతో.. దేశం పేరుని ఇండియా నుంచి భారత్‌గా మారుస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ అంశంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. ఇండియా, భారత్ రెండు పేర్లూ రాజ్యాంగంలో ఉన్నాయన్న ఆయన.. బహుశా ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టడం వల్లే కేంద్రం చిరాకు పడి ఉండొచ్చని చురకలంటించారు.
ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ‘దేశం పేరుని మార్చడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు రాహుల్ గాంధీ బదులిస్తూ.. ‘‘ఇండియా, భారత్.. ఈ రెండు పేర్లను రాజ్యాంగం వాడుతోంది. ఈ రెండు పేర్లు ఆమోదయోగ్యమైనవి. ఈ రెండు పేర్ల విషయంలో ఎలాంటి సమస్యా లేదు’’ అని బదులిచ్చారు. అనంతరం ఒక చిన్న చిరునవ్వు చిందిస్తూ.. ‘‘బహుశా మా ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడం, కేంద్ర ప్రభుత్వానికి చిరాకు తెప్పించిందేమోనని నేను అనుకుంటున్నాను. వారిని ఆగ్రహావేశాలకు గురి చేసి ఉండొచ్చని భావిస్తున్నాను. అందుకే.. ఇండియాకి బదులుగా దేశం పేరుని భారత్‌గా మార్చాలని వాళ్లు నిర్ణయించుకున్నారు’’ అని చెప్పారు.
కాగా.. జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అనే ముద్రణతో మొదలైన ఈ దేశం పేరు వివాదం ముదురుతూనే ఉంది. నిజానికి.. ఈ అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, చర్చలు మాత్రం విస్తృతంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో.. జీ20 వేదికపై ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్ మీద ‘భారత్’ అని పేర్కొని ఉండటం, దేశం పేరు మార్పు వాదనలకు మరింత బలం చేకూరింది. అయితే.. విపక్షాలు మాత్రం దీనిని ఖండిస్తున్నాయి. ఇండియా కూటమి భయంతోనే కేంద్రం దేశం పేరు మార్చేందుకు సిద్ధమైందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోదీ చరిత్రని అవమానిస్తున్నారంటూ విపక్ష నేతలు మండిపడుతున్నారు.