Rahul Gandhi: ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు.. ఒక్కసారి కూడా ఆ పని చేయలేదంటూ ధ్వజం
ABN , First Publish Date - 2023-10-17T23:01:07+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం తన పార్టీ తరఫున మిజోరాంలో ప్రచారం చేస్తున్న...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం తన పార్టీ తరఫున మిజోరాంలో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ.. మణిపూర్ సంక్షోభాన్ని మరోసారి లేవనెత్తారు. మే 3వ తేదీన మణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుంచి ప్రధాని మోదీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని విమర్శించారు. భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని.. అన్ని మతాలు, సంస్కృతులు, వర్గాలను రక్షించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ విశ్వసిస్తోందని ఆయన అన్నారు.
రాజధాని నగరం ఐజ్వాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మిజోరాం ప్రజలు బీజేపీని కోరుకోవడం లేదని అన్నారు. మిజోరాంలోకి బీజేపీ ప్రవేశించడం ఇక్కడి ప్రజలకు ఇష్టం లేదు కాబట్టే వారు తమతో ఉన్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో తమకు నిరూపితమైన ట్రాక్ రికార్డ్ ఉందని తెలిపారు. ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ పునాది వేసిందన్న ఆయన.. దేశ ధర్మాన్ని పరిరక్షించిన చరిత్రను తమ పార్టీ కలిగి ఉందని పేర్కొన్నారు. అయితే.. బీజేపీ మాత్రం భారతదేశపు సంస్థాగత నిర్మాణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికలు బీజేపీ-ఆర్ఎస్ఎస్ రాష్ట్రంలో ప్రవేశించకుండా రక్షించడం కోసమేనని చెప్పారు.
తాము భారతదేశపు ఆలోచనని, రాజ్యాంగాన్ని, దేశపు విలువల్ని రక్షిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది ఇండియా కూటమి ఆలోచన అని, ప్రస్తుతం భారతదేశంలో 60 శాతం ఇండియా కూటమి పాలిస్తోందని తెలిపారు. తమ రాజకీయ లబ్ది కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు ఈశాన్య ప్రాంత ప్రజల మతాలు, సంప్రదాయాలపై దాడి చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. మిజోరాంలోని రెండు ప్రాంతీయ పార్టీలైన MNF, ZPM బీజేపీకి ఎంట్రా పాయింట్‌లుగా పని చేస్తున్నాయని.. MNF ఇప్పటికే మిత్రపక్షంగా ఉందని అన్నారు. చివరికి.. అస్సాం ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాంతీయ పార్టీల ద్వారా ఇక్కడ రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
మణిపూర్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. అక్కడి కమ్యూనిటీలు విభజించబడ్డాయని రాహుల్ గాంధీ తెలిపారు. మైటీలు కుకీలున్న ప్రాంతాలకు.. అలాగే మైటీస్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాలకు కుకీలు వెళ్లలేని స్థితి అక్కడుందని చెప్పారు. ఇలాంటి దుస్థితి కలిగిన రాష్ట్రాన్ని సందర్శించడం తన కెరీర్‌లోనే తొలిసారి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేష రాజకీయాలు భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని.. వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని తొలగించాలని పిలుపునిచ్చారు. కొన్ని నెలల నుంచి మణిపూర్ తగలబడిపోతున్నా.. ప్రధాని మోదీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదన్నారు. ఒక ప్రధానిగా ఆ రాష్ట్రాన్ని వెళ్లాలన్న బాధ్యత మోదీదీ కాదా? అని ఆయన నిలదీశారు.
వంశపారంపర్య రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీలోనూ రాజవంశాలు నిండి ఉన్నాయని.. పెద్ద వ్యాపారుల్ని ప్రోత్సహించడం, చిరు వ్యాపారుల్ని చంపడమే ఆ పార్టీ ఆలోచన అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తనయులు ఏం చేస్తున్నారో తెలియదా? అని ప్రశ్నించారు. బీజేపీలోని నేతలు ఏం చేస్తున్నారో చూస్తే, మీకే సమాధానం దొరుకుతుందని చురకలంటించారు. బీజేపీలోనూ రాజవంశాలు నిండి ఉన్నాయి కాబట్టి, డైనస్టీ పాలిటిక్స్ అనే ప్రశ్న నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. ఇదే సమయంలో గాజా-ఇజ్రాయెల్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. తాము హింసకు వ్యతిరేకమని, సాధారణ జనాల్ని చంపే వాళ్లు ఎవరైనా నేరస్థులేనని వివరణ ఇచ్చారు.