Rahul Wayanad: ఆ పరిణామం తర్వాత... వయనాడ్‌కు తొలిసారిగా రాహుల్..!

ABN , First Publish Date - 2023-04-10T11:13:25+05:30 IST

కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు గెలిచి, అనర్హత వేటు పడటంతో ఆ సీటు కోల్పోయిన..

Rahul Wayanad: ఆ పరిణామం తర్వాత... వయనాడ్‌కు తొలిసారిగా రాహుల్..!

న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు గెలిచి, అనర్హత వేటు పడటంతో ఆ సీటు కోల్పోయిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారంనాడు వయనాడ్‌లో పర్యటించనున్నారు. అనర్హత వేటు అనంతరం వయనాడ్‌లో ఆయన పర్యటించనుండటం ఇదే ప్రథమం. నిబంధనల ప్రకారం ఖాళీ అయిన నియోజకవర్గానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అయితే, మార్చిలో ఈ ఖాళీ నోటిఫై అయినందున ఆరు నెలల్లోగా ఉప ఎన్నికల తేదీని ప్రకటిస్తామని ఈసీ ఇటీవల వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ వయనాడ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలో భాగంగా వయనాడ్‌లో జరిగే బహిరంగ సభ, రోడ్‌‌షోలో రాహుల్ పాల్గొంటారు.

పరువునష్టం కేసులో రాహుల్‌ను దోషిగా నిర్దారిస్తూ సూరత్ కోర్టు ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పై కోర్టుకు అప్పీలు చేసుకునేందుకు వీలుకల్పిస్తూ బెయిల్ సైతం మంజూరు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 'మోదీ' పేరుతో రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ రద్దు చేసింది. దీంతో మార్చి 24 నుంచి రాహుల్ సభ్యత్వం కోల్పోయారు. కింద కోర్టు తీర్పును సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ ఇటీవల సవాలు చేయగా, విచారణను కోర్టు వాయిదా వేస్తూ, ఆయనకు మంజూరు చేసిన బెయిలు గడువును పొడిగించింది.

మరో వివాదంలో రాహుల్...

రాహుల్ గాంధీ మరోసారి ఆదివారంనాడు వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీలో చేరిన లేదా దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో ఉన్న లేదా గౌతమ్ అదానీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని వెళ్లిపోయిన మాజీ కాంగ్రెస్ నేతల పేర్లతో ఓ ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అనిల్ ఆంటోనీ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు కూడా అందులో ఉన్నాయి. దీనిపై హిమంత్ బిస్వా శర్మ వెంటనే స్పందించారు. అదానీ గ్రూప్‌తో తన పేరును లింక్ చేస్తూ రాహుల్ చేసిన ట్వీట్‌పై పరువునష్టం కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పరువునష్టం కోవలోకి వస్తుందని, ప్రధాని ఆసోం నుంచి తిరిగి రాగానే ట్వీట్‌కు స్పందిస్తామని, తప్పనిసరిగా గౌహతిలో రాహుల్‌పై కేసు వేస్తామని చెప్పారు.

Updated Date - 2023-04-10T11:13:25+05:30 IST