Rahul Gandhi: ఎంపీ సభ్యత్వ పునరుద్ధరణ తర్వాత తొలిసారి వయనాడ్‌కు రాహుల్
ABN , First Publish Date - 2023-08-08T15:10:44+05:30 IST
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 12, 13 తేదీల్లో రెండ్రోజుల పాటు కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాహుల్ వయనాడ్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించనుండటం ఇదే ప్రథమం.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈనెల 12, 13 తేదీల్లో రెండ్రోజుల పాటు కేరళలోని వయనాడ్ (Wayanad) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాహుల్ వయనాడ్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించనుండటం ఇదే ప్రథమం.
మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన 2019 పరువునష్టం కేసులో రాహుల్‌కు పడిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని సోమవారంనాడు లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది.
వయనాడ్ ప్రజల వాణి..
వయనాడ్‌లో రాహుల్ పర్యటనను ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ ఓ ట్వీట్‌లో తెలిపారు. ఈనెల 12-13 తేదీల్లో రాహుల్ తన సొంత వయనాడ్ నియోజకవర్గంలో ఉంటారని చెప్పారు. ప్రజాస్వామ్యం గెలవడం, రాహుల్ తిరిగి తమ వాణిని పార్లమెంటులో పార్లమెంటులో వినిపించనుండటంపై వయనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాహల్ ఒక ఎంపీ మాత్రమే కాదని, వయనాడ్ కుటుంబంలో ఒక సభ్యుడని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగడంలో ఆయన సోమవారంనాడు పార్లమెంటుకు హాజరయ్యారు. ఆయనకు పలువురు విపక్ష ఎంపీలు సాదర స్వాగతం పలికారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి రాహుల్ పార్లమెంటుకు వచ్చారు. రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో మల్లికార్జున్ ఖర్గే స్వీట్లు పంచారు. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై రాహుల్‌ను సూరత్ కోర్టు దోషిగా నిర్దారిస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో గత మార్చి 23న రాహుల్ తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు. సూరత్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు గత శుక్రవారంనాడు నిలుపుదల చేసింది.