Rahul Gandhi: రాహుల్ కొత్త లుక్... మీరూ ఓ లుక్కేయండి..!
ABN , First Publish Date - 2023-03-01T13:51:40+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ''భారత్ జోడో యాత్ర'' పూర్తయ్యే నాటికి ఆయన రూపురేఖల్లో వచ్చిన మార్పులు చూసిన ఆశ్చర్యపడిన వాళ్లే ..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ''భారత్ జోడో యాత్ర'' పూర్తయ్యే నాటికి ఆయన రూపురేఖల్లో వచ్చిన మార్పులు చూసి ఆశ్చర్యపడిన వాళ్లే ఎక్కువ. నియంత సద్దాంతో పోల్చిన వారు కొందరైతే, ఆయన ఒక రుషి అని, రాముడని పోల్చినవారు మరికొందరు. యాత్ర పూర్తయిన వెంటనే కాంగ్రెస్ ప్లీనరీ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న రాహుల్ ఇప్పుడు లండన్‌లో అడుగుపెట్టారు. వారం రోజుల లండన్ పర్యటనలో ఆయన చదువుకున్న కేంబ్రిడ్జి యూనివర్శిటీలో జరిగే కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు ఆయన గడ్డం స్లిమ్ చేసుకున్నారు, జత్తు చిన్నగా కత్తిరించుకున్నారు. హుందాతనం ఉట్టిపడే సూట్ ధరించారు.
ఏభై రెండేళ్ల ఎలిజిబుల్ బ్యాచిలరైన రాహుల్ గాంధీ ''లెర్నింగ్ టు లిజిన్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ'' అనే సబ్జెక్ట్‌పై ప్రసంగించనున్నారు. మార్చి 5న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతో కూడా రాహుల్ సమావేశమవుతారు. రాహుల్‌కు కేంబ్రిడ్డ్ జేబీఎస్ ఆహ్వానం పలుకుతూ ఒక ట్వీట్ కూడా చేసింది. ''మా క్రేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ విపక్ష నేత రాహుల్ గాంధీని సాదరంగా ఆహ్వానిస్తోంది. విజిటింగ్ ఫెలో ఆఫ్ కేంబ్రిడ్జి జేబీఎస్‌గా ఆయన లెర్నింగ్ టు లిజన్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ'' అనే అంశంపై ఇవాళ మాట్లాడతారు'' అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.
రాహుల్ గాంధీ దేశ ఐక్యత నినాదంతో ''భారత్ జోడో యాత్ర''ను గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించి 12 రాష్ట్రాల మీదుగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నాలుగున్నర నెలల పాటు సాగిన రాహుల్ పర్యటన జమ్మూకశ్మీర్‌లో గత జనవరి 30న ముగిసింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో మూడురోజుల పాటు ఇటీవల ఏర్పాటు చేసిన 85వ ప్లీనరీలోనూ రాహుల్ పాల్గొని ప్రసంగించారు.