Rahul Gandhi: 'భారత్ జోడో'ను మోదీ సర్కార్ అడ్డుకోవాలనుకుంది: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2023-05-31T15:43:39+05:30 IST

ఐక్యతా సందేశంతో తాను భారతదేశంలో జరిపిన "భారత్ జోడో యాత్ర''ను అడ్డుకునేందుకు నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో లో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన ''మొహబ్బత్ కి దుకాన్'' కార్యక్రమంలో రాహుల్ బుధవారంనాడు ప్రసంగించారు.

Rahul Gandhi: 'భారత్ జోడో'ను మోదీ సర్కార్ అడ్డుకోవాలనుకుంది: రాహుల్ గాంధీ

శాన్‌ ఫ్రాన్సిస్కో: ఐక్యతా సందేశంతో తాను భారతదేశంలో జరిపిన "భారత్ జోడో యాత్ర'' (Bharat Jodo Yatra)ను అడ్డుకునేందుకు నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco)లో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన ''మొహబ్బత్ కి దుకాన్'' కార్యక్రమంలో రాహుల్ బుధవారంనాడు ప్రసంగించారు. భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమై 12 రాష్ట్రాల మీదుగా ముందుకు సాగి జనవరిలో జమ్మూకశ్మీర్ చేరుకోవడంతో పూర్తయిందని ఆయన చెప్పారు. పరస్పర ఆప్యాయత, గౌరవం, నమ్రత్ర వంటి స్ఫూర్తి సందేశాన్ని భారత్ జోడో యాత్రతో చాటామని తెలిపారు. రాజకీయాల్లో సహజంగా ఉపయోగించే ఎలాంటి పద్ధతులు కూడా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పనిచేయవనే విషయం యాత్రకు ముందే తాను గ్రహించినట్టు చెప్పారు. చరిత్రను ఒకసారి పరికిస్తే, ఆధ్యాత్మికవేత్తలైన గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురు వంటి వారు ఇదే మార్గాన్ని ఎంచుకుని దేశాన్ని ఐక్యంగా ఉంచారని గుర్తు చేశారు. అధికార బీజేపీ ప్రజలను భయపెడుతూ, ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నీ తనకే తెలుసునని అనుకుంటారని రాహుల్ విమర్శించారు. ఆ వ్యక్తులు దేవుడి పక్కన కూర్చుని, దేవుడికే అన్ని విషయాలూ వివరించి చెప్పగలరన్నారు. ‘మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే, ఈ విశ్వం ఎలా పని చేస్తోందో దేవుడికి మోదీ వివరిస్తారు. అప్పుడు దేవుడు కంగారుపడతాడు, నేను ఏం సృష్టించాను? అని అయోమయంలోకి వెళతాడు. ఇవి సరదా విషయాలు కానీ జరుగుతున్నది అదే. అన్ని విషయాలను అర్థం చేసుకునే ఓ బృందం ఉంది. వారు సైంటిస్టులకు సైన్స్‌ను వివరించి చెప్పగలరు. చరిత్రకారులకు చరిత్రను, సైన్యానికి యుద్ధాన్ని వివరించి చెప్పగలరు. కానీ వారిది మిడి మిడి జ్ఞానం, వారికి అసలు ఏదీ అర్థం కాదు. ఎందుకంటే జీవితంలో, వినడానికి సిద్ధంగా లేనపుడు మీరు దేనినీ అర్థం చేసుకోలేరు’’ అని రాహుల్ చెప్పారు.భారత దేశం ఏ సిద్ధాంతాన్నీ తిరస్కరించలేదన్నారు. అటువంటి భారత దేశానికి మీరు (ఎన్ఆర్ఐలు) ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. అమెరికాలో భారత దేశ జాతీయ జెండాను పట్టుకున్న ప్రవాస భారతీయులందరికీ ధన్యవాదాలు చెప్పారు.

Updated Date - 2023-05-31T15:43:39+05:30 IST