Security Breach : ద్రౌపది ముర్ముకు పాదాభివందనం చేయబోయిన ఇంజినీర్‌కు షాక్

ABN , First Publish Date - 2023-01-14T16:35:36+05:30 IST

భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాదాలను తాకేందుకు ప్రయత్నించిన రాజస్థాన్ ప్రభుత్వ

Security Breach : ద్రౌపది ముర్ముకు పాదాభివందనం చేయబోయిన ఇంజినీర్‌కు షాక్
President Draupadi Murmu

న్యూఢిల్లీ : భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాదాలను తాకేందుకు ప్రయత్నించిన రాజస్థాన్ ప్రభుత్వ ఇంజినీరు అంబ సియోల్ (Amba Siyol)ను జనవరి 13న పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసింది. రోహెట్‌లో జనవరి 4న జరిగిన స్కౌట్ గైడ్ జంబోరీ ప్రారంభ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడంతో ఆమెపై ఈ చర్య తీసుకున్నారు.

పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్ (అడ్మినిస్ట్రేషన్) ఇచ్చిన ఆదేశాల్లో, జూనియర్ ఇంజినీర్ అంబ సియోల్ రాష్ట్రపతి భద్రతా నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. రాజస్థాన్ సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం అంబను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా త్రాగునీటి సరఫరా బాధ్యతలను అంబ సియోల్ నిర్వహించారు. అయితే రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు నిల్చున్న అధికారుల మొదటి వరుసలోకి భద్రతా వలయాన్ని దాటుకుని అంబ చొచ్చుకెళ్లారు. హఠాత్తుగా దూసుకెళ్లి రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెను భద్రతా సిబ్బంది అడ్డుకుని, నిలువరించారు. స్థానిక పోలీసులు సాధారణ విచారణ జరిపి ఆమెను వదిలిపెట్టారు. కానీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిని తీవ్రంగా పరిగణించింది. దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని రాజస్థాన్ పోలీసులను ఆదేశించింది.

Updated Date - 2023-01-14T16:35:42+05:30 IST