Rahul Gandhi: ఆదివాసీలను వనవాసీలుగా మార్చిన బీజేపీ: రాహుల్

ABN , First Publish Date - 2023-08-09T17:36:18+05:30 IST

ఆదివాసీల స్థానే వనవాసీలనే కొత్త పేరును బీజేపీ తీసుకువచ్చిందని, ఇది ఆదివాసీల గౌరవాన్ని కించపరచడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాజస్థాన్‌ లోని బన్స్వారా జిల్లా మాన్‌గఢ్‌లో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.

Rahul Gandhi: ఆదివాసీలను వనవాసీలుగా మార్చిన బీజేపీ: రాహుల్

మాన్‌గఢ్: ఆదివాసీల (Adivasi) స్థానే వనవాసీలనే (Vanavasi) కొత్త పేరును బీజేపీ తీసుకువచ్చిందని, ఇది ఆదివాసీల గౌరవాన్ని కించపరచడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాజస్థాన్‌ (Rajasthan)లోని బన్స్వారా జిల్లా మాన్‌గఢ్ (Mangarh)లో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు ఆదివాసీలంటే ఎవరని తన నానమ్మ (ఇందిరాగాంధీ)ను అడిగానని, ఈ దేశంలోని తొలి నివాసులని ఆమె తనకు చెప్పిందని తెలిపారు. అయితే, ఇప్పుడు ఆదివాసీలకు వనవాసీలంటూ కొత్త పేరును బీజేపీ తీసుకువచ్చిందని, ఇది పూర్తిగా ఆదివాసీలను చిన్నబుచ్చడమేనని అన్నారు.


''వాళ్లు (బీజేపీ) మిమ్మల్ని (ఆదివాసీలు) అడవుల్లోనే జీవించేలా చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని వనవాసీలంటూ పిలుస్తున్నారు. కానీ, మీ భూములను గౌతమ్ అదానీకి కట్టబెడుతున్నారు. ఇది మీ (ఆదివాసీలు) దేశం. మీకు అన్ని హక్కులూ ఉన్నాయి'' అని రాహుల్ పెద్ద సంఖ్యలో సభకు హాజరైన ఆదివాసీలను ఉద్దేశించి అన్నారు. ర్యాలీలో రాహుల్ ఆదివాసీల తరహాలో దుస్తులు, తలపాగా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారు...

మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారని రాహుల్ ఈ సందర్భంగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రధాని కోరుకుంటే రెండు-మూడు రోజుల్లోనే మణిపూర్ మంటలను చల్చార్చి ఉండేవారని, కానీ మణిపూర్ రగులుతూనే ఉండాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ హింసపై ప్రధాని మౌనముద్ర దాల్చారని విమర్శించారు. కాగా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-09T17:42:28+05:30 IST