Right To Health Bill: వైద్యులతో కుదిరిన అవగాహన.. శుభవార్త చెప్పిన గెహ్లాట్ సర్కార్

ABN , First Publish Date - 2023-04-04T15:49:50+05:30 IST

రాజస్థాన్‌ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా మార్చి 21 అసెంబ్లీలో ఆమోదించిన ఆరోగ్య హక్కు బిల్లు ఎట్టకేలకు పట్టాలు.

Right To Health Bill: వైద్యులతో కుదిరిన అవగాహన.. శుభవార్త చెప్పిన గెహ్లాట్ సర్కార్

జైపూర్: రాజస్థాన్‌ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా మార్చి 21 అసెంబ్లీలో ఆమోదించిన ఆరోగ్య హక్కు బిల్లు (Right To Health Bill) ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. ఉచిత వైద్య సేవలను ప్రజల హక్కుగా మారుస్తూ రూపొందించిన ఆరోగ్య హక్కు బిల్లు (Right To Helath Bill)పై ప్రైవేటు వైద్యులు (Private Doctors) తమ ఆందోళనను మంగళవారంనాడు విరమించారు. రాజస్థాన్ సర్కార్‌కు, ప్రైవేటు డాక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, ఇది తనకు చాలా సంతోషం కలిగించిందని అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ట్వీట్ చేశారు. దీంతో దేశంలో ఆరోగ్య హక్కు చట్టాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రం క్రెడిట్ రాజస్థాన్‌కు దక్కింది.

ఆరోగ్య హక్కు బిల్లుపై ప్రైవేటు డాక్టర్లు కొద్దిరోజులుగా ఆందోళన‌కు దిగారు. వీటిని పరిగణనలోకి తీసుకుని గెహ్లాట్ సర్కార్ ప్రైవేటు వైద్యుల ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, యునైటెడ్ ప్రైవేట్ క్లినిక్ అండ్ హాస్పిటల్స్ అసోసియేషన్ (UPCHAR)తో కూడిన ప్రతినిధుల బృందం ప్రభుత్వంతో చర్చలు జరిపింది. అనంతరం ఎనిమిది పాయింట్లతో కూడిన మెమొరాండంపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. సబ్సిడీ రేటుకు భూములు, భవనాలు వంటి ప్రభుత్వ సాయం తీసుకోని ప్రైవేటు ఆసుపత్రులను ఆర్‌టీహెచ్ బిల్లు పరిధి నుంచి మినహాయించాలంటూ తాము చేసిన ప్రధాన డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించినట్టు ఆందోళనకు దిగిన వైద్యులు తెలిపారు.

తొలి రాష్ట్రం క్రెడిట్...

ప్రభుత్వానికి, ప్రైవేటు వైద్యులకు మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో దేశంలోనే ఆరోగ్య హక్కు బిల్లును అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రం క్రెడిట్ రాజస్థాన్‌కు దక్కిందని అశోక్ గెహ్లాట్ తన ట్వీట్‌లో తెలిపారు. వైద్యులు, పేషెంట్ల మధ్య ఉండే సత్సంబంధాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

రాజస్థాన్ ఆరోగ్య హక్కు బిల్లు ఏమి చెబుతోంది?

రాజస్థాన్‌లో ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కులను ఈ బిల్లు కల్పిస్తుంది. ఉచిత వైద్య సేవలను పౌరుల హక్కుగా అందిస్తుంది. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఉచితం. మందులు, డయాగ్నోస్టిక్ సేవలు, వైద్య పరీక్షలు ఉచితం. ఎమర్జెన్సీ వైద్య సేవలు ఉచితం. ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం కానీ, పోలీసు క్లియరెన్స్‌ల అవసరం కానీ లేదు. ఆసుపత్రికి వెళ్లి వచ్చేందుకు ఉచితంగానే ట్రాన్స్‌పోర్ట్ సేవలు అందించాలి.

Updated Date - 2023-04-04T15:49:50+05:30 IST