Rajasthan horror: మహిళను వివస్త్రను చేసి గ్రామంలో తిప్పారు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-09-02T15:27:04+05:30 IST

మహిళలపై దాష్టీకాలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూ సభ్యసమాజం తలవంచుకునేలా చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని నిచల్‌కోట గ్రామంలో ఇలాంటి అమానుష ఘటనే చోటుచేసుకుంది. 21 ఏళ్ల గిరిజన మహిళలను తీవ్రంగా కొట్టి, వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. సొంత భర్త, అత్తమామలే ఈ పైశాచికానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

Rajasthan horror: మహిళను వివస్త్రను చేసి గ్రామంలో తిప్పారు.. వీడియో వైరల్

జైపూర్: మహిళలపై దాష్టీకాలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూ సభ్యసమాజం తలవంచుకునేలా చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని నిచల్‌కోట గ్రామంలో ఇలాంటి అమానుష ఘటనే చోటుచేసుకుంది. 21 ఏళ్ల గిరిజన మహిళలను తీవ్రంగా కొట్టి, వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. సొంత భర్త, అత్తమామలే ఈ పైశాచికానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ధరియావాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు డీజీపీ ఉమేష్ మిశ్రా తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారంనాడు ప్రతాప్‌గఢ్ వెళ్లి బాధితురాలిని పరామర్శించనున్నారు


అక్రమ సంబంధమే కారణమా?

డీజీపీ ఉమేష్ మిశ్రా కథనం ప్రకారం, బాధితురాలికి గత ఏడాది వివాహమైంది. అయితే ఆమె అదే గ్రామంలో ఉంటున్న వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసిన అత్తామామలు ఆమెను కిడ్నాప్ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త స్వయంగా ఆమెపై దాడి చేసి వివస్త్రను చేశాడు. గ్రామంలో ఒక కిలోమీటర్ మేర ఆమెను నగ్నంగా తిప్పాడు. దీనిని కొందరు వీడియో తీయడంతో అది ఒక్కసారిగా సమాజిక మాధ్యమాల్లో సంచలనమైంది.


తొమ్మిది మంది అరెస్టు

కాగా, ఈ ఘటనకు సంబంధించి 13 మందిపై కేసు నమోదు చేయగా, ఇంటారగేషన్ అనంతరం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు క్రైమ్ విభాగం ఏడీజీ తెలిపారు. వీరిలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురికి కాళ్లు విరగడంతో వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.


క్రిమినల్స్‌ను వదలం: సీఎం

కాగా, గిరిజన మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా స్పందించారు. సభ్య సమాజంలో ఇలాంటి నేరాలకు తావు లేదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాచారం తెలియగానే ఘటనా స్థలికి వెళ్లాల్సిందిగా క్రైమ్ ఏడీజీనకి డీజీపీ ఆదేశాలిచ్చారని చెప్పారు. నేరస్తులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించి కటకటాల వెనక్కి పంపుతామని అన్నారు. కాగా, ప్రతాప్‌గఢ్ ఘటనపై మహిళా జాతీయ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను తక్షణం చేసి ఐపీసీ నిబింధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖాశర్మ ఆదేశించారు. ఐదు రోజుల్లోగా తమకు సమగ్ర నివేదక ఇవ్వాలని కోరారు.

Updated Date - 2023-09-02T16:17:59+05:30 IST