Ratan Tata: ఇంటిలోనే రతన్ టాటాకు 'ఉద్యోగ్ రత్న' అవార్డు ప్రదానం
ABN , First Publish Date - 2023-08-19T14:25:32+05:30 IST
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వం ''ఉద్యోగ్ రత్న'' అవార్డు ప్రదానం చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లు శుక్రవారంనాడు రతన్ టాటాకు ఆయన నివాసంలో ఈ అవార్డు అందజేశారు.
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా (Ratan Tata)కు మహారాష్ట్ర ప్రభుత్వం ''ఉద్యోగ్ రత్న'' అవార్డు ప్రదానం చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లు శుక్రవారంనాడు రతన్ టాటాకు ఆయన నివాసంలో ఈ అవార్డు అందజేశారు. అనారోగ్యం కారణంగా ఆదివారం అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరు కాలేనందున స్వయంగా ఇంటికి వెళ్లి ఈ అవార్డును ప్రదానం చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఉద్యోగ్ రత్న అవార్డును ఈ ఏడాది ప్రారంభించింది. మహారాష్ట్ర భూషణ్ అవార్డు చరిత్రను కొనసాగిస్తూ ఈ అవార్డును ప్రభుత్వం చేసింది. ప్రముఖ వ్యక్తులకు అందించే రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డు ఇది. వాణిజ్య, పారిశ్రామిక, విద్య, రియల్ ఎస్టేట్, పర్యాటకం, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, బ్యాంకింగ్, ఐటీ, ఫుడ్స్, హెల్త్‌కేర్, తదితర రంగాల్లో మహారాష్ట్ర అభ్యున్నతికి గణనీయంగా సేవలందించిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు.
దేశానికి టాటా సేవలు అసామాన్యం
రతన్ టాటా, టాటా గ్రూప్ దేశానికి విశిష్ట సేవలు అందించినట్టు అవార్డు ప్రదానం సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రశంసించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అందించిన అవార్డును స్వీకరించినందుకు రతన్ టాటాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.