Bihar: ఆర్జేడీ నేత కిడ్నాప్...కెమెరాకు చిక్కిన ఘటన
ABN , First Publish Date - 2023-03-14T14:52:41+05:30 IST
ఆర్జేడీ నేత సునీల్ రాయ్ మంగళవారం ఉదయం తన కార్యాలయం నుంచి అహహరణకు ..
పాట్నా: ఆర్జేడీ (RJD) నేత సునీల్ రాయ్ (Sunil Rai) మంగళవారం ఉదయం తన కార్యాలయం నుంచి అహహరణకు (Kidnap) గురయ్యారు. ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. సునీల్ రాయ్‌ని (42) అతని కార్యాలయం వెలుపల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ముఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ కమిటీ సమీపంలో రాయ్ కార్యాలయం ఉంది. ఘటనా స్థలి వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, రాయ్‌ని కిడ్నాప్ చేసేందుకు ఆయన కార్యాలయం వెలుపల ఒక తెలుపురంగు కారులో కిడ్నాపర్లు కాపుకాచారు. రాయ్ బయటకు రాగానే ఆయనను పట్టుకున్నారు. రాయ్ పెనుగులాడినప్పటికీ వారు అతన్ని బలవంతంగా వాహనంలోకి నెట్టి అక్కడ్నించి తీసుకు వెళ్లిపోయారు. సుమారు ఆరుగురు ఈ కిడ్నాప్‌కు
పాల్పడినట్టు కెమెరాలో కనిపిస్తోంది. ఘటనా స్థలి వద్ద రాయ్ మొబైల్ ఫోన్ పడి ఉంది. సునీల్ రాయ్ ఇంతకుముందు ఆర్జేడీ రెబల్ నేతగా మారి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. భూములకు సంబంధించిన వ్యాపారాల్లో కూడా రాయ్ ఉన్నట్టు చెబుతున్నారు. కాగా, తెల్లవారుజాము ఫోన్ రావడంతో తన కుమారుడు పార్టీ కార్యాలయానికి వెళ్లినట్టు సునీల్ రాయ్ తండ్రి తెలిపారు. రాయ్ కిడ్నాప్‌నుకు వ్యక్తిగత గొడవలేమీ లేవని అన్నారు. కాగా, సొమ్ములిస్తే విడిచిపెడతామంటూ కిడ్నాపర్లు ఇంతవరకూ ఎలాంటి డిమాండ్ చేయలేదని తెలుస్తోంది.
శాంతిభద్రతలు లోపించాయి...
కాగా, రాయ్ కిడ్నాప్‌పై బీజేపీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తార్‌కిషోర్ ప్రసాద్ మాట్లాడుతూ, మహాకూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. శాంతిభద్రతలు లోపిస్తే ప్రతి ఒక్కరూ ప్రమాదంలో పడినట్టేనని, పరిస్థితిని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అదుపు చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.