Rowdy sheeters: రాష్ట్రంలో మొత్తం రౌడీ షీటర్ల సంఖ్య ఎంతో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-07-14T09:16:21+05:30 IST
రాష్ట్రంలో గత ఐదేళ్ళ అవధిలో రౌడీ షీటర్ల(Rowdy sheeters) జాబితాలోకి కొత్తగా మరో 14,163మందిని పోలీసులు చేర్చారని వీరితో కలిపి ఈ జాబితాలో
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత ఐదేళ్ళ అవధిలో రౌడీ షీటర్ల(Rowdy sheeters) జాబితాలోకి కొత్తగా మరో 14,163మందిని పోలీసులు చేర్చారని వీరితో కలిపి ఈ జాబితాలో మొత్తం 46,149 మంది రౌడీషీటర్లు ఉన్నారని హోం శాఖా మంత్రి డా.జి.పరమేశ్వర్(Home Minister Dr. G. Parameshwar) ప్రకటించారు. విధానపరిషత్‌లో అరవిందకుమార్ అరళి అడిగిన ప్రశ్నకు గురువారం మంత్రి బదులిచ్చారు. సత్ప్రవర్తన కారణంగా ఆరు సంవత్సరాల కాలంలో 27,294 మంది పేర్లను రౌడీషీటర్ల జాబితా నుంచి తొలగించడం జరిగిందన్నారు. రౌడీషీటర్లలో పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని 54 జైళ్ళలో 14,237 మంది ఖైదీలను మాత్రమే బంధించి ఉంచేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 16,053 మంది ఖైదీలున్నారని మంత్రి వివరించారు. జైళ్ళను ఆధుణికీకరించి విస్తరించే పనుల్లో ఉన్నామన్నారు. రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి 10,883 కేసులు దాఖలు కాగా వీటిలో విచారణ జరిపి 8,457 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేయడం జరిగిందని ఇదే సమయంలో 1523 కేసుల్లో బీ-రిపోర్టు సమర్పించారని మంత్రి వెల్లడించారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు ఇతర కారణాలతో రాష్ట్రంలో ప్ర స్తుతం 4,890 మంది విదేశీయులున్నారని హొం మత్రి ప్రకటించారు. ప్రస్తుత ఏడాది మే నాటికి వీసా గడువు ముగిసిన 754 మంది విదేశీయులను తిప్పి పంపే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. విదేశీయుల్లో అత్యధికులు విద్యార్ధులేనని ఆయన వివరించారు.