Sachin Pilot: కాంగ్రెస్ ఐక్యతా రాగం.. కలిసి పోరాడతామన్న సచిన్ పైలట్.. ఎన్నికల వేళ పార్టీకి బూస్ట్
ABN , First Publish Date - 2023-11-19T17:08:25+05:30 IST
రాజస్థాన్ లో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఉప్పు, నిప్పులా ఉన్న సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gahlot), మాజీ మంత్రి సచిన్ పైలట్(Sachin Pilot) ఐక్యతారాగం వినిపిస్తున్నారు.
జైపుర్: రాజస్థాన్ లో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఉప్పు, నిప్పులా ఉన్న సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gahlot), మాజీ మంత్రి సచిన్ పైలట్(Sachin Pilot) ఐక్యతారాగం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు నిర్ణయించినవారే నాయకత్వ పగ్గాలు చేపడతారని సచిన్ తాజాగా కామెంట్ చేశారు.
"ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) దృష్టి అంతా గెలుపుపైనే ఉంటుంది. మేం మా లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించం. గెలిచాక నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలో హైకమాండ్ కి తెలుసు. పార్టీలో ఏవైనా సమస్యలుంటే అధిష్టానంతో మాట్లాడి పరిష్కరించుకుంటాం. అది మా సంప్రదాయం, విధానం, చరిత్ర, నాయకత్వ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తప్పకుండా ఉంటుంది. 2018 ఎన్నికల్లో గెలిచిన స్థాయిలోనే ఈ సారి కూడా విజయం సాధిస్తాం. కానీ మెజారిటీ సాధించడంపై దృష్టి పెట్టాం.
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రాజస్థాన్ లో హ్యాట్రిక్ సృష్టిస్తుంది' అని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజస్థాన్(Rajasthan)లోని టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ రంగంలోకి దిగారు. ఆయన ప్రస్తుతం అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ(BJP) అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అజిత్ సింగ్ మెహతా బరిలో నిలిచారు. రాజస్థాన్‌లో నవంబర్ 25న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. చివరికి బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.