Gehlot Vs Pilot: మళ్లీ మొదలైన లడాయి..!
ABN , First Publish Date - 2023-01-20T18:05:09+05:30 IST
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో సాగినప్పుడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిరినట్టు...
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ''భారత్ జోడో యాత్ర'' రాజస్థాన్‌లో సాగినప్పుడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ahok Gehlot), ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపించినా మళ్లీ ఇద్దరి మధ్యా 'ఉప్పూనిప్పూ' వాతావరణం నెలకొంటోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అశోక్ గెహ్లాట్ గురువారంనాడు చేసిన వ్యాఖ్యల వీడియో బయటకు రావడంతో తాజాగా ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
సచిన్ పైలట్ పేరును గెహ్లాట్ నేరుగా ప్రస్తావించకుండా 'కరోనా వైరస్' అంటూ వ్యాఖ్యానించడం తాజా మాటల యుద్ధానికి కారణమవుతోంది. ''సమావేశాలు మళ్లీ జరుపుతున్నాం. ఇంతకుముందు ఒక కరోనా ఉండేది, చాలా పెద్ద కరోనా మా పార్టీలో ప్రవేశించింది'' అని గెహ్లాట్ తన తాజా వీడియోలో వ్యాఖ్యానించడం వైరల్ అవుతోంది. గెహ్లాట్ ఇందులో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, గతంలో పైలట్‌ను ద్రోహి అని, పసలేనవాడని విమర్శించడంతో తాజా వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీటుగా బదులిచ్చిన పైలట్..
కాగా, గెహ్లాట్ వ్యాఖ్యలపై సచిన్ పైలట్ సైతం అంతే దీటుగా సమాధానమిచ్చారు. అయితే ఆయన కూడా నేరుగా గెహ్లాట్ పేరును ప్రస్తావించ లేదు. ''రాజకీయాల్లో సంయమనం పాటించడం చాలా ముఖ్యం. మీరు గౌరవం ఇస్తేనే, గౌరవం పుచ్చుకోగలుగుతారు. ఎవరైనా సరే మాటను అదుపులో పెట్టుకోవాలి. ఎదుట వ్యక్తిపై నిందలు వేయడం చాలా సులభం. ఒకసారి నోరు జారిన తర్వాత ఆ మాటలు వెనక్కి తీసుకోవడం మాత్రం కష్టం. నేను ఎప్పుడూ వ్యక్తిగత దాడులు చేయలేదు'' అని పైలట్ శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గౌరవం లేకుండా మాట్లాడే వ్యక్తుల విషయంలో తాను కామెంట్ చేయలేనని, తనపై ఎందుకు కామెంట్లు చేస్తున్నారో కూడా తనకు తెలియదని అన్నారు.
సెప్టెంబర్ నాటి పరిణామాలు..
గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి గెహ్లాట్ పేరును తొలుత కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలించడం, రాజస్థాన్ ముఖ్యమంత్రి బాధ్యతలు పైలట్‌కు అప్పగించాలని భావించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పైలట్‌కు సీఎం పగ్గాలు అప్పగించేందుకు గెహ్లాట్ మార్గం సుగమం చేస్తాడని అధిష్ఠానం భావించినప్పటికీ కథ అడ్డం తిరిగింది. గెహ్లాట్ సన్నిహితులైన 100 ఎమ్మెల్యేలు పైలట్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌పై తిరుగుబాటు యత్నం చేశారు. దీంతో గెహ్లాట్ స్థానంలో మల్లికార్జున్ ఖర్గే పేరును జాతీయ అధ్యక్షుడిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై కూడా గెహ్లాట్‌ను మందలించింది. ఆ తర్వాత పార్టీకి గెహ్లాట్ క్షమాపణ చెప్పడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది.