AgustaWestland Scam: క్రిస్టియన్ మైకేల్‌కు సుప్రీంకోర్టు బెయిలు నిరాకరణ

ABN , First Publish Date - 2023-02-07T17:32:01+05:30 IST

అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యహరించిన ఆరోపణలతో అరెస్టయిన క్రిస్టియన్ మైకేల్ జేమ్స్‌కు...

AgustaWestland Scam: క్రిస్టియన్ మైకేల్‌కు సుప్రీంకోర్టు బెయిలు నిరాకరణ

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో (AugustaWestland Chopper scam) మధ్యవర్తిగా వ్యహరించిన ఆరోపణలతో అరెస్టయిన క్రిస్టియన్ మైకేల్ జేమ్స్ (Christian Michel James)కు నిరాశ ఎదురైంది. అతని బెయిల్ అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఈ కుంభకోణంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండు వేర్వేరు కేసులు నమోదు చేశాయి. మైకేల్ బెయిల్ అభ్యర్థనపై అభిప్రాయం చెప్పాలంటూ గత ఏడాది మేలో సీబీఐ, ఈడీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీతో రూ.3600 కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందాన్ని గత యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ మేరకు 12 హెలికాప్టర్లను భారత వైమానికి దళానికి అప్పగించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, సుమారు రూ. 480 కోట్లు చేతులు మారాయని సీబీఐ విచారణలో తేలింది. ఈ కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్నాడనే ఆరోపణలపై బ్రిటన్ జాతీయుడైన మైకేల్‌ను దుబాయ్ 2018లో భారత్‌కు అప్పగించింది. అప్పట్నించి అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో, దానిని సుప్రీంకోర్టులో ఆయన సవాలు చేశారు. విచారణలో మైకేల్ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, అండర్ ట్రయిల్ ప్రిజనర్‌ నిర్బంధానికి సంబంధించిన గరిష్ట పరిమితిని నిర్దారించే సీఆర్‌పీసీ సెక్షన్ 436ఎ కేసు నమోదయిందని, తన క్లెయింట్ నేరారోపణలపై నేరానికి విధించే శిక్షలో 50 శాతం శిక్ష పూర్తిచేశాడని చెప్పారు.

బెయిలు ఇవ్వదగిన కేసుగా పరిగణించడం లేదు..

దీనికి ముందు, 2001లో ఈడీ, సీబీఐ దాఖలు చేసిన రెండు కేసుల్లో విచారణ కోర్టు మైకేల్ బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. వాస్తవాలు, పరిస్థితులు, నిందితుడిపై ఆరోపణల తీవ్రత, నేర తీవ్రత, నిందితుడి ప్రవర్తన పరిగణనలోకి తీసుకుంటే బెయిల్ ఇవ్వదగిన కేసుగా దీనిని భావించడం లేదని కోర్టు పేర్కొంది.

Updated Date - 2023-02-07T17:40:22+05:30 IST