Prime Minister Modi : ప్రజల జీవితాల్లో మార్పే సైన్స్ లక్ష్యం కావాలి
ABN , First Publish Date - 2023-01-04T04:06:53+05:30 IST
కొత్తగా వస్తున్న పరిజ్ఞానాలపై దృష్టి సారించి.. జ్ఞానాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పులు తేవడానికి ఉపయోగించాలని దేశంలోని పరిశోధకులకు ప్రధాని మోదీ సూచించారు. దేశ అవసరాలను తీర్చడమే
నాగ్‌పూర్, జనవరి 3: కొత్తగా వస్తున్న పరిజ్ఞానాలపై దృష్టి సారించి.. జ్ఞానాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పులు తేవడానికి ఉపయోగించాలని దేశంలోని పరిశోధకులకు ప్రధాని మోదీ సూచించారు. దేశ అవసరాలను తీర్చడమే శాస్త్రీయ సమాజం లక్ష్యంగా ఉండాలని.. సైన్స్ భారతదేశాన్ని ఆత్మనిర్భర దేశంగా మార్చాలని నిర్దేశించారు. ప్రపంచ జనాభాలో 17 నుంచి 18 శాతం మంది భారతదేశంలోనే నివసిస్తున్న విషయాన్ని గుర్తుచేసిన ఆయన.. శాస్త్రీయ అభివృద్ధి ఏదైనా సరే ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉండాలని, మొత్తం మానవాళికీ ఉపయోగపడే అంశాలపైనే శాస్త్రీయ సమాజం దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు. ‘‘మహిళా సాధికారత ద్వారా సుస్థిర ప్రగతికి సైన్స్ అండ్ టెక్నాలజీ’’ అనే థీమ్‌తో నాగ్‌పూర్‌లో ఐదురోజులపాటు సాగే 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రె్‌సను మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ప్రారంభించి ప్రసంగించారు. క్వాంటమ్ టెక్నాలజీ, డేటాసైన్సెస్ వంటి నవీన శాస్త్రాలపైన.. కొత్త టీకాల అభివృద్ధి, కొత్తగా తలెత్తే వ్యాధులపై నిఘా పెంపు వంటి అంశాలపైన దృష్టి సారించాలని, శాస్త్రీయ ప్రక్రియలను బలోపేతం చేయాలని పరిశోధకులకు దిశానిర్దేశం చేశారు. ఈ 21వ శతాబ్దంలో భారతదేశంలో అపరిమితంగా డేటా, టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయని.. అవి భారతీయ సైన్స్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తాయని ధీమా వ్యక్తం చేశారు.
పరిశోధనల్లో మహిళా భాగస్వామ్యం రెట్టింపు
ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్ ఇతివృత్తంగా మహిళా సాధికారతను ఎంచుకోవడాన్ని మోదీ స్వాగతించారు. ‘‘సైన్స్ ద్వారా మహిళల సాధికారత సాధించడానికే మన ఆలోచనలు పరిమితమైపోకూడదు. మహిళల భాగస్వామ్యంతో సైన్స్ అభివృద్ధిపైన కూడా మనం దృష్టి సారించాలి’’ అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్ర యోజన మహిళా సాధికారతలో కీలకపాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. దేశంలో విశ్వవిద్యాలయాలకు ఆవల జరిగే పరిశోధనల్లో మహిళల భాగస్వామ్యం రెట్టింపు అయిందని పేర్కొన్నారు.