Oommen Chandy : అనారోగ్యంతో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూత
ABN , First Publish Date - 2023-07-18T06:47:39+05:30 IST
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (80) (Oommen Chandy ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని బెర్లిన్స్ చారిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చాందీ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు.. ఆయన ఇకలేరన్న వార్తతో వీరాభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు..
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (80) (Oommen Chandy ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని బెర్లిన్స్ చారిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని చాందీ కుమారుడు చాందీ ఊమెన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. చాందీ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు.. ఆయన ఇకలేరన్న వార్తతో వీరాభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. అభిమాన నాయకుడ్ని చూడటానికి చారిటీ ఆస్పత్రికి అభిమానులు, నేతలు తరలివస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు కాంగ్రెస్ (Congress) అగ్రనేతలు, ముఖ్యనేతలు.. ఊమెన్ చాందీ మృతికి నివాళులు అర్పిస్తున్నారు.
ఒకే నియోజకవర్గం నుంచి 12 సార్లు..
కాగా.. 1943 అక్టోబర్ 31న కేరళలో ఊమెన్‌చాందీ జన్మించారు. ఈయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. 1970లో మొదటిసారి పూతుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం 12 సార్లు ఎమ్మెల్యేగా పూతుపల్లి నుంచే గెలిచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చాందీ.. నిజాయితీ, నిబద్ధతతో విశ్వాసపాత్రుడిగా నిలవడంతో కాంగ్రెస్ అధిష్టానం.. రెండుసార్లు కేరళ ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టింది. 2004 నుంచి 2006 వరకు ఒకసారి.. 2011 నుంచి 2016 వరకు రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్నారు. 2018 నుంచి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అంతేకాదు.. కె. కరుణాకరన్, ఏకే ఆంటోని హయాంలో ఆర్థిక శాఖమంత్రిగా, హోం మంత్రిగా, కార్మికశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర ప్రజలతో మొదట్నుంచీ మంచి అనుబంధం ఉన్న మాస్ లీడర్ అని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
వన్ అండ్ ఓన్లీ..!
రాజకీయ కురువృద్ధుడిగా, విశ్వాసపాత్రుడిగా, పార్టీలో కీలక నేతగా పేరొందారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత 2018లో ఏపీ వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు. ప్రజాసేవకు గానూ ఐక్యరాజ్యసమితి నుంచి అవార్డు అందుకున్న ఏకైక భారతీయ సీఎం చాందీనే కావడం విశేషమని చెప్పుకోవచ్చు.