Chief Minister: సీఎం కీలక నిర్ణయం.. ఎనిమిదేళ్ల తర్వాత తెరపైకి..
ABN , First Publish Date - 2023-06-08T12:59:26+05:30 IST
ఒక ప్రధాన కులానికి ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఏ కులానికి చెందినవారు ఎంత జనాభా ఉన్నారు, వారిలో విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఒక ప్రధాన కులానికి ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఏ కులానికి చెందినవారు ఎంత జనాభా ఉన్నారు, వారిలో విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు, వారి జీవన విధానం ఏ విధంగా సాగుతోందనే రీతిలో రాష్ట్రంలో చారిత్రాత్మకంగా జరిపిన కులగణన సర్వే మరోసారి తెరపైకి వచ్చింది. కులగణన నివేదికను స్వీకరిస్తామని ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచడం ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లోకి చేర్చేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రకటించారు. బుధవారం కులసంఘాల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఇదే సందర్భంలో సిద్దరామయ్య మాట్లాడుతూ ఎనిమిదేళ్ల క్రితం తమ ప్రభుత్వంలో రూ. 162 కోట్ల ఖర్చుతో కులగణన సర్వేను చేశామని, వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఇటీవల అధికారంలో కొనసాగిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపించిన వేళ హడావుడిగా రిజర్వేషన్లు పెంచి జిమ్మిక్కులు చేసిందన్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు వీలు లేకుండా ఉండాలనే ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు ప్రకటించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల వర్గీకరణను గందరగోళం చేశారన్నారు. అన్ని కులాల విశ్వాసంతో రిజర్వేషన్లు కల్పించాలనే తమ సూచనలను పాటించలేదన్నారు. బీజేపీ గతంలోనూ రిజర్వేషన్లను వ్యతిరేకించిందని, ఎన్నికల వేళ హడవుడి చేసిందన్నారు. గతంలో తమ ప్రభుత్వం బీసీ కమిషన్ ద్వారా కులాల ఆధారంగా సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలకు సంబంధించి సమీక్ష నిర్వహించామన్నారు. గత ప్రభుత్వాలు వెనుకడుగు వేశాయని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చామని, నివేదికను స్వీకరిస్తామన్నారు. ప్రజలకు విద్య, ఉద్యోగంతోపాటు విభిన్న రంగాల్లో అవకాశాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమన్నారు.