Sharad Pawar: జీ20 సమ్మిట్‌లో వెండి, బంగారు పూత పాత్రల వినియోగంపై.. కేంద్ర ప్రభుత్వంపై శరద్ పవార్ విమర్శలు

ABN , First Publish Date - 2023-09-11T20:29:05+05:30 IST

ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్ని భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. చరిత్రలో నిలిచిపోయేలా, ప్రపంచ దేశాలన్నీ భారత్ జపం చేసేలా.. ఈ సదస్సుని కేంద్రం గ్రాండ్‌గా...

Sharad Pawar: జీ20 సమ్మిట్‌లో వెండి, బంగారు పూత పాత్రల వినియోగంపై.. కేంద్ర ప్రభుత్వంపై శరద్ పవార్ విమర్శలు

ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్ని భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. చరిత్రలో నిలిచిపోయేలా, ప్రపంచ దేశాలన్నీ భారత్ జపం చేసేలా.. ఈ సదస్సుని కేంద్రం గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. అంతేకాదు.. జీ20 దేశాధినేతల అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. వారికి ఇచ్చిన విందులో వెండి, బంగారు పూత పూసిన పాత్రలను వినియోగించారంటే.. కేంద్రం ఏ విధమైన ఏర్పాట్లు చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. విందులో భాగంగా వెండి, బంగారు పూత పాత్రలను ఉపయోగించడంపై కేంద్రం ప్రభుత్వం మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అతిథుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది కానీ, మరీ ఇంత ఆర్భాటం ఏమాత్రం అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ విషయంపై తాజాగా ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తీవ్రంగా తీవ్రంగా స్పందించారు. ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదనేలా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముంబయిలో విలేకరుల సమావేశాలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘‘గతంలో మన భారత్‌లో ఇలాంటి కార్యక్రమాలు రెండుసార్లు జరిగాయి. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఈవెంట్ ఒకటి జరిగింది. అయితే.. ఈ ఈవెంట్స్‌లో అతిథుల విందు కోసం వెండి వస్తువులు గానీ, బంగారు పూత పూసిన పాత్రలను గానీ ఉపయోగించినట్లు నేను ఎప్పుడూ వినలేదు. అవును.. భారత్‌కు వచ్చే ప్రపంచ అగ్రనేతలను గౌరవించాల్సిన అవసరం ఉంది. అది దేశానికి ముఖ్యమైనది కూడా. కానీ.. ముఖ్యమైన సమస్యల్ని పక్కనపెట్టి, కేవలం కొంతమంది వ్యక్తుల స్థాయిని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాల్ని దుర్వినియోగం చేయడం ఏమాత్రం సబబు కాదు’’ అని కేంద్రంపై నిప్పులు చెరిగారు.

ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు.. దేశాధినేతలతో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించాలని శరద్ పవార్ సూచించారు. చర్చించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని.. కానీ, ఇలాంటి ఆర్భాటాలు వల్ల ఆ సమస్యల్ని పక్కదారి పట్టించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అటు.. నెటిజన్లు సైతం ‘‘ఐశ్వర్యాన్ని ప్రదర్శించడం కోసం ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేయడం అర్థరహితం’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-11T20:29:05+05:30 IST