Sharad pawar on Adani: అదానీ అంశంలో విపక్షాలతో విభేదించిన శరద్ పవార్

ABN , First Publish Date - 2023-04-08T15:28:31+05:30 IST

అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌తో నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్..

Sharad pawar on Adani: అదానీ అంశంలో విపక్షాలతో విభేదించిన శరద్ పవార్

న్యూఢిల్లీ: అదానీ అంశంపై (Adani Issue) జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)తో దర్యాప్తు జరిపించాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌తో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) విభేదించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటే సరైనదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదానీ అంశం పార్లమెంటు రెండోవ విడత బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర రభసకు దారితీసి సభాకార్యక్రమాల ప్రతిష్టంభనకు దారితీసింది. అదానీ అంశంపై జేపీసీకి విపక్షాలు పట్టుపట్టగా, దానిని అధికార పార్టీ సభ్యులు ప్రతిఘటించారు.

జేపీసీకి మద్దతిచ్చిన మాట నిజమే...

కాగా, అదానీ అశంపై జేపీసీ దర్యాప్తునకు తమ పార్టీ (NCP) మద్దతిచ్చినమాట నిజమేనని, అయితే, జేపీసీపై అధికార పార్టీ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందని, అందువల్ల నిజం బయటకు రావాలంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్యానల్ ఏర్పాటే మెరుగైన మార్గంగా తాను భావిస్తున్నట్టు శరద్ పవార్ చెప్పారు.

నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు అంశాలు మరింత కీలకం...

కేంద్ర ప్రభుత్వంపై ఆయుధాలు ఎక్కుపెట్టేందుకు విపక్షాలు అంబానీ-అదానీల అంశాన్ని ఆయుధంగా చేసుకుంటున్నాయని, అయితే దేశానికి వాళ్ల కంట్రిబ్యూషన్‌ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని పవార్ అన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుల, రైతు సమస్యలు వంటి అంశాలు మరింత కీలకమని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాల ఐక్యత కోసం ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో కీలక పరిణామాలపై మాట్లాడుతూ, అన్ని అంశాలనూ సమావేశంలో చర్చించామని చెప్పారు. కొన్ని అంశాలపై అంగీకారానికి రానప్పటికీ, ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను సమావేశంలో చెప్పడం జరిగిందని వివరించారు.

పవార్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ స్పందన...

అదానీ అంశంపై జేపీసీ దర్యాప్తు కంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ మెరుగ్గా ఉంటుందంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ ధాకరే వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. జేపీసీ చైర్మన్‌గా బీజేపీకి చెందిన వారు ఉంటారని, ఆ కారణంగా జేపీసీ వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. అదానీపై టీఎంసీ, ఎన్‌సీపీలకు వారి సొంత అభిప్రాయాలు ఉన్నాయని, అయితే విపక్ష ఐక్యతపై వీటి ప్రభావం ఉండదని రౌత్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-04-08T15:32:32+05:30 IST