Sharad Pawar, Sachin pilot BJP : కమలం దిశగా పవార్‌, పైలట్‌!

ABN , First Publish Date - 2023-04-11T03:29:56+05:30 IST

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయా? వీరిద్దరూ కమలం పార్టీకి దగ్గరవుతున్నారా?

Sharad Pawar, Sachin pilot BJP  : కమలం దిశగా పవార్‌, పైలట్‌!

మోదీ డిగ్రీ అంశం, జేపీసీపైన బీజేపీని సమర్థించేలా పవార్‌ వ్యాఖ్యలు

రాజస్థాన్‌లో పైలట్‌ దూకుడు.. సీఎం గహ్లోత్‌ సర్కారుకు మళ్లీ చిక్కులు

(సెంట్రల్‌ డెస్క్‌)

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయా? వీరిద్దరూ కమలం పార్టీకి దగ్గరవుతున్నారా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు ఔననే చెబుతున్నాయి. శరద్‌ పవార్‌ తాజా వ్యాఖ్యలు మహా వికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ)లో భాగమైన కాంగ్రెస్‌ పార్టీని ప్రత్యక్షంగా ఇరకాటంలో పారేస్తుండగా.. సచిన్‌ పైలట్‌ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ను ప్రత్యక్షంగా.. కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని పరోక్షంగా టార్గెట్‌గా చేసుకుంటున్నారు. దేశంలో సమస్యలే లేవా? నిరుద్యోగం, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణం.. ఇలా ఎన్నో సమస్యలను విస్మరిస్తున్న విపక్షాలు అదానీ అంశం, ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్‌పై గళం విప్పడం విడ్డూరమంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏదో సంస్థ(హిండెన్‌బర్క్‌) నివేదికతో అదానీ విషయంలో ఇంత రచ్చ అవసరమా? దానికి జేపీసీ ఎందుకు?’’ అంటూ ఆయన శుక్రవారం ఓ జాతీయ న్యూస్‌చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఓ వైపు విపక్షాలు అదానీ అంశంపై పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశాయి. ఈ నేపథ్యంలో విపక్షంలో ఉన్న పవార్‌ అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడడాన్ని బట్టి, ఆయన కమలానికి దగ్గరవుతున్నారని స్పష్టమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంతేకాదు.. సావర్కర్‌పై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపైనా శరద్‌పవార్‌ పెద్దన్నలా వ్యవహరించి, రాహుల్‌, సోనియాతో భేటీ అయ్యారు. ఇంకెప్పుడూ తాను సావర్కర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయబోనంటూ ప్రకటించేలా చేశారు. ఇది కూడా ఎంవీఏ మిత్రపక్షాల్లో ఒకటైన కాంగ్రె్‌సను ఇరకాటంలో పారేసినట్లయింది. ఇక బీజేపీ ఇప్పుడు శరద్‌పవార్‌ వ్యాఖ్యలను అదనుగా మలచుకుంటూ విపక్షాలపై మండిపడుతోంది.

అదును చూసి.. పైలట్‌ ఆందోళన

రాజస్థాన్‌ సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ ఇప్పుడు అదును చూసి, ఆందోళన ప్రారంభించారని విశ్లేషకులు అంటున్నారు. ఆయన మళ్లీ తిరుగుబావుటాకు సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజస్థాన్‌లో వసుంధర హయాంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, గెహ్లోత్‌ ఆమెతో చేతులు కలిపాడని పైలట్‌ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. నవంబరులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్లీ పీసీసీ చీఫ్‌ పగ్గాలు ఇస్తే తప్ప పైలట్‌ తన ఆందోళనలకు స్వస్తిపలికే పరిస్థితులు కనిపించడంలేదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల్లోగా పైలట్‌ కొత్త పార్టీ పెట్టడమో.. ఆప్‌ లేదా బీజేపీలో చేరడమో జరిగే సూచనలు కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పైలట్‌ పార్టీని వీడబోరని కాం గ్రెస్‌ నేత పవన్‌ఖేరా ఓప్రకటనలో తెలిపారు. ఒకవేళ ఫైలట్‌ దీక్షకుదిగితే అది పార్టీని ఽధిక్కరించినట్లేనన్నారు.

Updated Date - 2023-04-11T03:30:05+05:30 IST