Share News

Hamas-Israel War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఇజ్రాయెల్‌తో భారత ప్రభుత్వం లేదంటూ కుండబద్దలు

ABN , First Publish Date - 2023-10-13T17:37:16+05:30 IST

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపుదాడులు చేసిన వెంటనే.. ఈ దాడిని భారత ప్రభుత్వం ఖండించింది. ఈ దాడి బాధాకరమైన విషయమని, ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని...

Hamas-Israel War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఇజ్రాయెల్‌తో భారత ప్రభుత్వం లేదంటూ కుండబద్దలు

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపుదాడులు చేసిన వెంటనే.. ఈ దాడిని భారత ప్రభుత్వం ఖండించింది. ఈ దాడి బాధాకరమైన విషయమని, ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని స్వయంగా ప్రధాని మోదీ ట్విటర్ మాధ్యమంగా తెలిపారు. అంతేకాదు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా తాము ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. కానీ.. ఈ యుద్ధ సమయంలో భారత ప్రభుత్వం 100 శాతం ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపడం లేదంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ కుండబద్దలు కొట్టారు.

శరద్ పవార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అధికారిక ప్రకటనను పరిశీలిస్తే, భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో 100 శాతం లేదని అర్థమవుతోంది. ఆ దేశానికి అండగా ఉన్నామని చెప్తూనే, పూర్తి మద్దతు తెలపడం లేదని స్పష్టమవుతోంది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అనేది చాలా సున్నితమైన అంశం. దీనిపై ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ఆఫ్ఘినిస్తాన్, ఇరాన్, యూఏఈ, గల్ఫ్ దేశాలను దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే.. ఈ యుద్ధం అంశంపై భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం.. ఆ దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని అన్నారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి పాలస్తీనాకు మద్దతు ఇవ్వడంపై స్పందిస్తూ.. అది కేవలం ఆయనకు సంబంధించిన వ్యవహారం కాదని, పాలస్తీనాపై సుదీర్ఘకాలం నుంచి ఉన్న భారత వైఖరి అని చెప్పుకొచ్చారు.


ఇంతకు ఈ యుద్ధంపై భారత ప్రభుత్వ వైఖరి ఏంటి?

ఈ వివాదంపై భారత ప్రభుత్వం రెండు దేశాల సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం.. రెండు దేశాల పౌరులకు ఆ మొత్తం ప్రాంతంలో నివసించే హక్కు ఉంది. కానీ.. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించాయి. ఈ మొత్తం భూభాగంపై సార్వభౌమాధికారాన్ని కోరుకుంటున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఈ పోరాట ఫలితమే ప్రస్తుత యుద్ధానికి బీజం వేసింది. దీంతో భారత ప్రభుత్వం మరోసారి ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేసింది. సార్వభౌమ పాలస్తీనా రాజ్య స్థాపన కోసం ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష చర్చలను పునఃప్రారంభించాలని భారతదేశం ఎల్లప్పుడూ సమర్థిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-13T17:37:16+05:30 IST