Shashi Tharoor: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన: శశిథరూర్ డిమాండ్

ABN , First Publish Date - 2023-05-07T11:37:28+05:30 IST

న్యూఢిల్లీ: మణిపూర్‌ లోని గిరిజనులకు, జనాభాపరంగా ఆధిక్యత కలిగిన మైతై కమ్యూనిటీకి మధ్య చెలరేగిన అల్లర్లతో ఆ రాష్ట్రం అట్టుడుకుతుండటంపై బీజేపీని కాంగ్రెస్ నేత శశిథరూర్ తప్పుపట్టారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

Shashi Tharoor: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన: శశిథరూర్ డిమాండ్

న్యూఢిల్లీ: మణిపూర్‌ (Manipur)లోని గిరిజనులకు, జనాభాపరంగా ఆధిక్యత కలిగిన మైతై కమ్యూనిటీకి మధ్య చెలరేగిన అల్లర్లతో ఆ రాష్ట్రం అట్టుడుకుతుండటంపై బీజేపీని కాంగ్రెస్ నేత శశిథరూర్ (Shashi Tharoor) తప్పుపట్టారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన (President Rule) విధించాలని డిమాండ్ చేశారు. సుమారు ఏడాది క్రితం బీజేపీని ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా చూసినందుకు తాము మోసపోయామని మణిపూర్‌ ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు.

''గుజరాజ్‌లో సుపరిపాలన ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ కారణంగా ఆ రాష్ట్రంలో ఇప్పుడేం జరుగుతోందో భారతీయులంతా తమను తాము ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఆ రాష్ట్రంలోని ఓటర్లంతా తాము వంచనకు గురయ్యామని బాధపడుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉంది'' అని శశిథరూర్ ట్వీట్ చేశారు.

గిరిజనులు, గిరిజనేతరులకు మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనల్లో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అనధికార సమాచారం ప్రకారం మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుదని చెబుతున్నారు. 150కి మంది ప్రజలు గాయపడ్డారు. అయితే, సైన్యం, ఆర్ఏఎఫ్, సీఆర్‌పీఎఫ్, అసోం రైఫిల్స్ పహారా మధ్య ఇంఫాల్ లోయలో క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటోంది. దుకాణాలు తెరుచుకుంటున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వీలుగా మణిపూర్ ప్రభుత్వం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకూ కర్ఫ్యూను పాక్షికంగా సడలించింది.

ప్రజలు సోదరభావంతో ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి భయాలు, అభద్రతా భావాలకు తావీయవద్దని గవర్నర్ అనుసూయియా ఉడకే పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అఖిలపక్ష సమవేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. శాంతి పునరుద్ధరణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మరో 20 కంపెనీల పారామిలటరీ బలగాలను మణిపూర్‌కు కేంద్రం పంపింది. ఆదివారం నిర్వహించాల్సిన నీట్ పరీక్షలను అల్లర్ల కారణంగా వాయిదా వేశారు. వారికి మరో తేదీని ప్రకటించనున్నట్టు కేంద్రం రాష్ట్రానికి తెలిపింది.

ఇంఫాల్ వ్యాలీలోని మైతైలకు, కొండప్రాంతాల్లో ఆవాసం ఉంటున్న కుకీలకు మే 3న ఘర్షణలు చెలరేగాయి. ఆయుధాలతో గ్రామాలపై విరుచుకుపడి, ఇళ్లకు నిప్పు పెట్టారు. దుకాణాలను కొల్లగొట్టారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసి, నిషేధ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చింది. మెజార్టీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్‌ తెగలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపుతప్పింది.

Updated Date - 2023-05-07T11:58:23+05:30 IST