DK Shivakumar: అలా చేస్తే...పరువునష్టం దావా వేస్తా: డీకే వార్నింగ్

ABN , First Publish Date - 2023-05-16T16:48:50+05:30 IST

న్యూఢిల్లీ: కర్ణాటక తదుపరి సీఎం విషయంలో సిద్ధరామయ్య , డీకే శివకుమార్ ఎవరికి వారే గట్టి పట్టుదలతో ఉండగా, డీకే రాజీనామా చేయనున్నారనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. ఈ వార్తలను డీకే తీవ్ర స్థాయిలో ఖండించారు. అలాంటి వార్తలు ప్రసారం చేస్తే పరువునష్టం కేసు వేస్తానన్నారు. పార్టీనే తన తల్లి అని స్పష్టం చేశారు

DK Shivakumar: అలా చేస్తే...పరువునష్టం దావా వేస్తా: డీకే వార్నింగ్

న్యూఢిల్లీ: కర్ణాటక తదుపరి సీఎం విషయంలో సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ (DK Shivakumar) ఎవరికి వారే గట్టి పట్టుదలతో ఉండటంతో అధిష్ఠానం రకరకాల ఫార్ములాలు డీకే ముందు ఉంచుతోంది. మరోవైపు, సిద్ధరామయ్యకు అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నాయని, సిద్ధరామయ్యకు సీఎం పదవి విషయంలో డీకే అభ్యంతరం చెబుతున్నారనే ప్రచారమూ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీకే రాజీనామా చేయనున్నట్టు వార్తలు కూడా షికారు చేస్తున్నారు. ఈ వార్తలను డీకే తీవ్ర స్థాయిలో ఖండించారు. అలాంటి వార్తలు ప్రసారం చేస్తే పరువునష్టం కేసు వేస్తానన్నారు. పార్టీనే తన తల్లి అని స్పష్టం చేశారు.

''నేను రాజీనామా చేసినట్టు ఏదైనా ఛానెల్ రిపోర్ట్ చేస్తే, వారిపై నేను తప్పనిసరిగా పరువునష్టం కేసు వేస్తాను. కొందరు నేను రాజీనామా చేస్తున్నట్టు రిపోర్ట్ చేస్తున్నారు. పార్టీ నాకు తల్లి. పార్టీని నేను నిర్మించుకున్నాను. నా అధిష్ఠానం, నా ఎమ్మెల్యేలు, నా పార్టీ, 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు'' అని డీకే ఢిల్లీలో తన సోదరుడు, ఎంపీ డీకే సురేష్ నివాసానికి వెళ్తూ మీడియాకు చెప్పారు.

ఒంటరిగా రమ్మన్నారు..

దీనికి ముందు డీకే బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరుతూ కాంగ్రెస్ పార్టీనే తన సర్వం అంటూ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు దైవం అని, అది తనకు దేవాలయమని చెప్పారు. పార్టీ తన తల్లిలాంటిందని అన్నారు ''పిల్లలకు ఏమి ఇవ్వాలో దేవుడికి, తల్లికి బాగా తెలుసు. నా దేవుడిని చూసేందుకు దేవాలయానికి వెళ్తున్నాను. నన్ను ఒక్కడినే రమ్మనమని జనరల్ సెక్రటరీ కోరారు. దాంతో ఒక్కడినే వెళ్తున్నా'' అని నవ్వుతూ డీకే చెప్పారు. కాగా, సిద్ధరామయ్యకు గతంలో సీఎం ఛాన్స్ ఇచ్చారని, ఈసారి డీకేకు అవకాశమివ్వాలని డీకే మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-05-16T16:48:50+05:30 IST