Karnataka Results: కింగ్ మేకర్ ఆశలు అడియాసలు..మూడో స్థానానికి పరిమితమైన జేడీఎస్...ఎక్కడ తేడా కొట్టిందంటే..!

ABN , First Publish Date - 2023-05-13T16:24:43+05:30 IST

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో మళ్లీ 'కింగ్ మేకర్' కావాలనుకున్న జేడీఎస్ ఆశలు గల్లగంతయ్యాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న జేడీఎస్ నేత హెచ్‌డి కుమారస్వామికి పార్టీ ఫలితాలు షాకిచ్చాయి. కాంగ్రెస్ ఉవ్వెత్తున ఎగసిపడి మెజారిటీ మార్క్‌ను దాటేయగా, జేడీఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. దీంతో ఎక్కడ తేడా కొట్టిందనే దానిపై జేడీఎస్ అంతర్మథనంలో పడింది.

Karnataka Results: కింగ్ మేకర్ ఆశలు అడియాసలు..మూడో స్థానానికి పరిమితమైన జేడీఎస్...ఎక్కడ తేడా కొట్టిందంటే..!

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో మళ్లీ 'కింగ్ మేకర్' కావాలనుకున్న జేడీఎస్ (JDS) ఆశలు గల్లగంతయ్యాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న జేడీఎస్ నేత హెచ్‌డి కుమారస్వామి (HD Kumara Swamy)కి పార్టీ ఫలితాలు షాకిచ్చాయి. కాంగ్రెస్ ఉవ్వెత్తున ఎగసిపడి మెజారిటీ మార్క్‌ను దాటేయగా, జేడీఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. దీంతో ఎక్కడ తేడా కొట్టిందనే దానిపై జేడీఎస్ అంతర్మథనంలో పడింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 73.19 శాతం ఓటింగ్ నమోదైంది. శనివారం ఉదయం నుంచి కౌటింగ్ చురుకుగా సాగుతూ వచ్చింది. ఒకసారి కాంగ్రెస్‌కు ఆధిక్యం, మరోసారి బీజేపీకి ఆధిక్యం అన్నట్టుగా ఓట్ల లెక్కింపు సరళి సాగి, చివరకు కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి కింగ్‌మేకర్‌గా చక్రం తిప్పాలని ఆశించిన జేడీఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. ప్రభుత్వం ఏర్పాటుపై ఎవరూ తనను సంప్రదించలేదని, తమది చిన్న పార్టీ అని కుమారస్వామి ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే వ్యాఖ్యానించి పరోక్షంగా ఓటమిని, కింగ్ మేకర్ కావాలన్న ఆలోచనకు గండిపడిన విషయాన్ని అంగీకరించారు.

ఓటమి కారణాలు ఏమిటి?

జేడీఎస్ ఓటమికి పలు కారణాలు ఉన్నాయి. పార్టీలో స్టార్ ప్రచారకర్తలు (Star campaigners) లేరు. కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులే మొదట్నించీ ప్రచారకర్తలుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది. పార్టీ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ప్రజాభిప్రాయంగా ఉంది. అలాగే, అభ్యర్థుల ప్రకటన విషయంలో జాప్యం జరిగింది. ఎన్నికలు ప్రకటించేంత వరకూ, రామనగర అభ్యర్థిగా ఎవరు నిలబడతారనే ఆసక్తికి తెరపడలేదు. రామనగర నుంచి తనకు బదులుగా నిఖిల్ కుమారస్వామికి అనిత కుమారస్వామి టిక్కెట్ ఇప్పించారు. అయితే, నిఖిల్ కుమారస్వామి ఆ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఓటమిని చవిచూశారు. జేడీఎస్ పార్టీ ఇప్పటికీ రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలను గుర్తుచేస్తూనే ఉంది. చివరి నిమిషం వరకూ హసన్ నియోజకవర్గం టిక్కెట్ ఎవరికి ఇస్తారనే విషయంలో సస్పెన్స్‌ కొనసాగింది. రేవణ్ణ భార్యకు ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరిగినప్పటికీ, చివరకు సుప్రీత్‌కు ఆ టిక్కెట్ కేటాయించారు. హసన్‌లో సుప్రీత్ గెలిచారు. హెలెనరసిపూర్‌లో హెచ్‌డీ గెలిచారు. రేవణ్ణ కూడా గెలుపొందారు. పార్టీకి నిధులు లేకపోవడం కూడా ఒక కారణమని హెచ్‌డీ కుమారస్వామి ఎన్నికల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు కావాలని, డబ్బులు లేకుండా ఇవాళ గెలవడం కష్టమని అన్నారు. తగిన వనరులు ఉంటే మరో 20 నుంచి 30 సీట్లు గెలిచేవారమని అన్నారు.

ఓటమిని అంగీకరిస్తున్నా...అయితే...

ఎన్నికల సర్వేలన్నీ రెండు జాతీయ పార్టీలనే ప్రధానంగా పేర్కొంటూ, జేడీఎస్‌‌ను ఖాతరు చేయనప్పటికీ తమ పార్టీ మెజారిటీ సాధిస్తుందని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన హెచ్‌డీ కుమార స్వామి తాజా పరిణామాలపై సూటిగా స్పందించారు. ప్రజాతీర్పును తాను గౌరవిస్తున్నానని అన్నారు. అయితే, ఈ ఓటమితో అంతా ముగిసినట్టు కాదని, తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాతీర్పే అంతమమని అన్నారు. గెలుపు ఓటములను తాను సమానంగా స్వీకరిస్తానని ఓ ట్వీట్‌లో తెలిపారు. ఓటమితో అంతా ముగిసినట్టుకాదని, ప్రజల పక్షాన తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. జేడీఎస్‌ను ఆశీర్వదించి, రేయింబవళ్లు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలు, అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఓటమితో ఎవరూ నిరాశపడవద్దని, తాను ఎప్పుడూ వారి వెన్నంటే ఉంటానని భరోసా ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టనున్న కొత్త ప్రభుత్వానికి గుడ్ లక్ తెలిపారు.

Updated Date - 2023-05-13T16:24:43+05:30 IST