CM Siddaramaiah: బీజేపీని కూడా టార్గెట్ చేస్తే.. అసలు అవినీతి బయటపడుతుంది
ABN , First Publish Date - 2023-12-10T16:24:42+05:30 IST
కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం కాంగ్రెస్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుండటాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పు పట్టారు. కేంద్రం కావాలనే కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని, బీజేపీని కాదని ఆయన మండిపడ్డారు.
CM Siddaramaiah On Odisha IT Raids: కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం కాంగ్రెస్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుండటాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పు పట్టారు. కేంద్రం కావాలనే కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని, బీజేపీని కాదని ఆయన మండిపడ్డారు. జార్ఖండ్, ఒడిశాలో రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన సంస్థలపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
‘‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేవలం కాంగ్రెస్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. బిజెపి నాయకులపై కూడా దాడులు చేయనివ్వండి. అప్పుడే వారి వద్ద ఎంత అవినీతి సంపద ఉందో బయటపడుతుంది’’ అని సిద్ధరామయ్య చెప్పారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. నల్లధనం ఎవరు కూడబెట్టినా అది తప్పే అవుతుందని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఐటీ శాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనివ్వాలని.. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రం కాంగ్రెస్‌ను సెలెక్టివ్‌గా టార్గెట్ చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. బీజేపీపై కాకుండా కాంగ్రెస్ నేతలపైనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన ఆయన.. బీజేపీ వాళ్లపై కూడా దాడులు నిర్వహిస్తే భారీ డబ్బు దొరుకుతుందని అన్నారు.
ఇదిలావుండగా.. ఒడిశాకు చెందిన బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, దానితో సంబంధం ఉన్న సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.290 కోట్లకు పైగా భారీ నగదు పట్టుబడింది. అల్మారాల్లో కళ్లుచెదిరే నోట్ల గుట్టలు లభ్యమయ్యాయి. అధికారుల వివరాల ప్రకారం.. ఈ సోదాల్లో భాగంగా ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంగణాలు కూడా కవర్ చేశారు. ఒకే ఆపరేషన్‌లో ఇంత భారీ స్థాయిలో నల్లధనం దొరకడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు.