Siddaramaiah: ఇదే ఇప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద సవాల్.. ఏడాదికి రూ.50వేల కోట్లు సమకూర్చుకోవడం ఎలా..

ABN , First Publish Date - 2023-06-04T11:23:32+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని కుటుంబాలకు సంక్షేమాలు వర్తించేలా గ్యారెంటీలను ప్రకటించింది. వాటిని అమలు చేసేందుకు సిద్ధమైం

Siddaramaiah: ఇదే ఇప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద సవాల్.. ఏడాదికి రూ.50వేల కోట్లు సమకూర్చుకోవడం ఎలా..

- సిద్దరామయ్యకు తలనొప్పిగా మారిన గ్యారెంటీ పథకాలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని కుటుంబాలకు సంక్షేమాలు వర్తించేలా గ్యారెంటీలను ప్రకటించింది. వాటిని అమలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో రాష్ట్ర ఖజానాపై పెనుభారం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రకటించిన ఐదు గ్యారెంటీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.50వేల కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఉచిత ప్రయాణం మహిళలందరికీ వర్తింప చేస్తున్నారు. గ్యారెంటీల్లో అమలయ్యే తొలి పథకం ఇదే. దాదాపు దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్లు నష్టాలబాటలో ఉన్నాయి. సంస్థలు గట్టెక్కేందుకు ఏటా ప్రభుత్వం గ్రాంట్లు కేటాయిస్తోంది. ప్రస్తుతం మహిళలందరికీ ఉచితమనే గ్యారెంటీ అమలుతో సంస్థల పరిస్థితి మరింత దారి తప్పనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులను కుదిస్తారనే భయం రవాణా సంస్థలో వెంటాడుతోంది. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించాల్సి ఉంటుంది. అన్ని ఎస్కాంలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఉచితమంటే అదనపుభారం కానుంది. బీపీఎల్‌, ఏపీఎల్‌తో సంబంధం లేకుండా ఇంటి బాధ్యతలు పర్యవేక్షించే ప్రతి మహిళకు రూ.2వేల చొప్పున గృహలక్ష్మి గ్యారెంటీ ద్వారా అందించనున్నారు. లక్షలాది కుటుంబాలకు వర్తించే పథకం కావడంతో ఆర్థికంగా పెనుభారం కానుందని విశ్లేషకులు అంటున్నారు. అన్నభాగ్య ద్వారా 10 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం బీపీఎల్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఇస్తున్నారు. అదనపు కోటా పెంచేందుకు కేంద్రాన్ని కోరే ఆలోచనలో ఉన్నారు. కేంద్రప్రభుత్వం సహకరించకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అదనపుభారానికి కారణమే కానుంది. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ రూ.2.43 లక్షల కోట్లుగా ఉంది. ఆర్థిక లోటుతో జీడీపీ 3.48 శాతంగా ఉండేది. నిధుల సమకూర్చుకునేందుకు రూ.71,432 కోట్లు అప్పు తీసుకునేందుకు శాసనసభ నుంచి ఆమోదం పొందారు. కానీ 67,462 కోట్లు మాత్రమే రుణం పొందారు. 2023-24 లో రాష్ట్ర బడ్జెట్‌ను రూ.3.09 లక్షల కోట్లకు పెంచాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

గ్యారెంటీలకు ముందే సవాళ్లు

ఇప్పటికే జలవనరులు, ప్రజాపనులతోపాటు వివిధ శాఖల ద్వారా అమలు చేసిన పనులకు రూ.17వేల కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. మిగిలిన శాఖలను పరిగణనలోకి తీసుకుంటే రూ.25వేల కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏడో వేతన కమిషన్‌ మధ్యంతర పరిష్కారంగా 17 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తద్వారా రూ.17వేల కోట్లు అదనపు భారం కానుంది. విద్యుత్‌, ఆహారధాన్యం, సామాజిక భద్రతా పింఛన్ల అమలుకు ఏడాదికి సుమారు రూ.30వేల కోట్ల అవసరం ఉండేది. మధ్యంతర ఆర్థిక నివేదికల్లో వీటిని తగ్గించాలనే ప్రతిపాదనలు చేసిన ప్రతిసారి ఎక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం గ్యారెంటీలతో రూ.50వేల కోట్లతో పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆదాయంతో అభివృద్ధి అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం, ఉద్యానవనం, తాగునీరు, విద్య, వైద్యం వంటి అత్యవసర పథకాలతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ గ్రాంట్లను తగ్గించే అవకాశం ఉండదు. ఇలా అన్ని విధాలా రాష్ట్ర ఖజానాపై భారం పెరగనుంది. అయితే ఆర్థిక అంశాలలో అపారమైన అనుభవం కల్గిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది క్రియాశీలకమవుతోంది.

Updated Date - 2023-06-04T11:23:32+05:30 IST