Share News

Delhi:ఢిల్లీని కప్పేసిని పొగమంచు.. దారుణంగా పడిపోయిన వాయు నాణ్యత

ABN , First Publish Date - 2023-10-23T10:31:06+05:30 IST

ఢిల్లీని ఈ ఏడాది కూడా కాలుష్యం పట్టిపీడించనుందా? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఇవాళ ఉదయాన్నే దేశ రాజధానిని పొగ మంచు కప్పేసింది. దీంతో పబ్లిక్ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వాయు నాణ్యత సూచిలో ఢిల్లీ(Delhi) దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత సోమవారం చాలా పేలవమైన కేటగిరీకి పడిపోయిందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index) స్పష్టం చేస్తోంది. ఈ సీజన్ లో ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు.

Delhi:ఢిల్లీని కప్పేసిని పొగమంచు.. దారుణంగా పడిపోయిన వాయు నాణ్యత

ఢిల్లీ: ఢిల్లీని ఈ ఏడాది కూడా కాలుష్యం పట్టిపీడించనుందా? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఇవాళ ఉదయాన్నే దేశ రాజధానిని పొగ మంచు కప్పేసింది. దీంతో పబ్లిక్ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వాయు నాణ్యత సూచిలో ఢిల్లీ(Delhi) దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత సోమవారం చాలా పేలవమైన కేటగిరీకి పడిపోయిందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index) స్పష్టం చేస్తోంది. ఈ సీజన్ లో ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం జహంగీర్‌పురి ప్రాంతంలో AQI గరిష్టంగా 349కి చేరుకుంది. వాయు నాణ్యత సూచి 0-50 మధ్య ఉంటే "మంచిది", 51-100 "సంతృప్తికరమైనది", 101-200 "మితమైన", 201-300 "పేలవమైనది", 301-400 "చాలా పేలవమైనది", 401-500 "తీవ్రమైనది"గా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ AQI "తీవ్రమైన ప్లస్" విభాగంలోకి వస్తుంది. ఆదివారం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ సీజన్‌లో తొలిసారిగా AQI "చాలా పేలవమైన" స్థితికి పడిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో చివరిసారిగా మే 17న వాయు నాణ్యత సూచీ 336 పాయింట్లు నమోదైంది. ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గుతోందనే ఆందోళనల మధ్య.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) రెండో దశలో వివరించిన విధంగా, జాతీయ రాజధాని పరిధిలో (NCR) 11-పాయింట్ల యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ప్యానెల్ ఇప్పటికే నిర్ణయించింది. ఏక్యూఐ సూచీ విలువ 301వ పాయింట్ ని తాకితే ఎన్‌సీఆర్ ప్రాంతంలో యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు అవేర్ నెస్ కార్యక్రమాలు నిర్వహించింది.


క్రాకర్స్ నిషేధించాలని కోరిన ప్రభుత్వం..

నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో క్రాకర్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీపావళి సందర్భంగా ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడమే ధ్యేయంగా ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) రెండు రోజుల క్రితం సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఢిల్లీ(Delhi) మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. దేశ రాజధాని పరిసరాల్లో కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా క్రాకర్స్ పై, డీజిల్ తో నడిచే బస్సులపై నిషేధం విధించాలని కోరారు. చలికాలంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ఎన్ సీఆర్ పరిధిలోని ప్రాంతాల్లో కాలుష్యాన్ని అరికట్టడానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంటల్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) నివేదిక ప్రకారం, ఢిల్లీలో ఏర్పడుతున్న కాలుష్యంలో 31 శాతం రాజధానిలోని పలు ప్రాంతాల నుంచి ఏర్పడగా, 69 శాతం ఎన్ సీఆర్ రాష్ట్రాల నుంచే వస్తోంది. ఎన్ సీఆర్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాల్లో పొల్యూషన్ ని కంట్రోల్(Pollution Control) చేయకపోతే ఢిల్లీలో పరిస్థితి మారదని రాయ్ అన్నారు.


బాణసంచా, చెత్తను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలని.. సీఎన్‌జీ(CNG), ఎలక్ట్రిక్ వాహనాలను(EV) మాత్రమే వాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమల్లో కాలుష్య ఇంధనాలను ఫైన్డ్ నేచురల్ గ్యాస్ గా మార్చాలని, ఇటుక బట్టీల పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి జిగ్ జాగ్ టెక్నాలజీ ఉపయోగించాలని.. డీజిల్ జనరేటర్లపై ఆధారపడకుండా ఎన్ సీఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉంచాలని కోరారు.

అవగాహన కార్యక్రమాలు

కాలుష్య నియంత్రణే ధ్యేయంగా గత శుక్రవారం ఢిల్లీలో 'రన్ అగైనెస్ట్ పొల్యూషన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో వాహన కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 'రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్' ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బాణసంచా ద్వారా ఏర్పడే కాల్చడాన్ని తగ్గించేందుకు 'పటాకే నహీ.. దియే జలావో' అనే ప్రజా చైతన్య ప్రచారాన్ని మళ్లీ ప్రవేశపెట్టబోతోంది.

Updated Date - 2023-10-23T10:31:06+05:30 IST