Modi on Karge remarks: కాంగ్రెస్ వ్యాఖ్యలను స్వీకరిస్తున్నా: మోదీ
ABN , First Publish Date - 2023-04-30T16:03:30+05:30 IST
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనపై చేసిన 'విషపు నాగు' వ్యాఖ్యాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..
కోలార్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తనపై చేసిన 'విషపు నాగు' వ్యాఖ్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూటిగా స్పందించారు. పరమేశ్వరుని మెడలో హారం నాగుపాము అని, తన వరకూ ప్రజలే శివుళ్లనీ, నాగేంద్రుడిలా వారి వెన్నంటి ఉండేందుకు తాను సిద్ధమని అన్నారు. కర్ణాటక పవిత్ర భూమి అని, ప్రజలే ఓటు ద్వారా కాంగ్రెస్‌కు గట్టి స్పందన తెలియజేస్తారనే విషయం తనకు తెలుసునని చెప్పారు.
కుటుంబ పార్టీలు....
కాంగ్రెస్, జేడీయూ వేర్వేరుగా కనిపిస్తున్నా, రెండూ ఒకటేనని, రెండూ కుటుంబ పార్టీలేనని ప్రధాని విమర్శించారు. భారత్‌కు గ్రోత్ ఇంజన్ కర్ణాటక అని, అస్థిర ప్రభుత్వం ఏర్పడటం మంచిది కాదని సూచించారు. అస్థిర ప్రభుత్వం వల్ల అభివృద్ధి జరగదని, ప్రజలను లూటీ చేస్తారని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాలు ఉన్నప్పడు కొన్ని ప్రత్యేక కుటుంబాలే అభవృద్ధి చెందాయని, బీజేపీకి మాత్రం ఈ దేశంలోని ప్రతి కుటుంబం సొంత కుటుంబమని అన్నారు. వంచనకు మారుపేరు కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. కర్ణాటకలో కింగ్‌మేకర్‌గా జేడీఎస్ చెప్పుకుంటుందని, జేడీఎస్‌కు వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్‌కు వేసినట్టేనని అన్నారు. ప్రజలు, రైతులు, పేదల కోసం పాటుపడే పార్టీ బీజేపీ మాత్రమేనని, డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో రైతులు ఎంతో లబ్ధి పొందారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ వ్యాఖ్యలకు తగిన గుణపాఠం చెప్పాలని కోలార్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ పిలుపునిచ్చారు.