Share News

Snow: మంచుదుప్పట్లో కున్నూరు.. వాహనాల రాకపోకలకు అంతరాయం

ABN , First Publish Date - 2023-12-13T10:24:06+05:30 IST

నీలగిరి జిల్లా కున్నూరును బుధవారం వేకువజామున దట్టమైన మంచు కప్పేసింది. రహదారుల్లో మంచు వర్షం కురుస్తుండటంతో

Snow: మంచుదుప్పట్లో కున్నూరు.. వాహనాల రాకపోకలకు అంతరాయం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): నీలగిరి జిల్లా కున్నూరును బుధవారం వేకువజామున దట్టమైన మంచు కప్పేసింది. రహదారుల్లో మంచు వర్షం కురుస్తుండటంతో వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. స్థానికులు చలితో వణకిపోయారు. ఇంటి నుంచి వెలుపలికి రాలేకపోతున్నారు. ఇంతటి తీవ్రస్థాయిలో దట్టమైన మంచు వ్యాపించడం ఐదు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమమని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు చెబుతున్నారు. నీలగిరి జిల్లాలో యేటా నవంబర్‌ నుంచి జనవరి మొదటివారం వరకు ఈశాన్య రుతుపవనాల ప్రభావిత వర్షాలు కురవడం ఆనవాయితీ. ఈ మేరకు ప్రస్తుతం ఆ జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నారు. కున్నూరు - మేట్టుపాళయం(Kunnuru - Mettupalayam) ఘాట్‌లో ఈ వర్షాల కారణంగా ఇప్పటివరకూ 15 చోట్ల మట్టిచరియలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. 23 చోట్ల చెట్లు కూలాయి. దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘాట్‌లో జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అగ్నిమాపక, విపత్తు సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నీలగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం దట్టమైన మంచు కురుస్తోంది. ప్రత్యేకించి కున్నూరులో మంగళవారం వేకువజామున మంచు తీవ్రంగా కురిసింది. ఫోకస్‌ లైట్లు వేసుకున్నా ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలియనంతగా మంచు అలముకుంటోంది. అంతేకాకుండా మేఘాలు కూడా కున్నూరు - మేట్టుపాళయం మార్గంలో భూమికి చేరువగా వస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటల తర్వాతే స్థానికులు బయటకు వస్తున్నారు. మరో వారం వరకూ కున్నూరు పరిసర ప్రాంతాల్లో మంచు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

nani1.jpg

Updated Date - 2023-12-13T10:24:08+05:30 IST