Share News

Sri lanka: భారత్ సహా 7 దేశాలకు వీసాలు లేకుండా శ్రీలంక ఫ్రీ ఎంట్రీ

ABN , First Publish Date - 2023-10-24T15:54:04+05:30 IST

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఏడు దేశాల టూరిస్టులకు వీసాలు లేకుండా పర్యటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడు దేశాల్లో ఇండియా, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ ఉన్నాయి.

Sri lanka: భారత్ సహా 7 దేశాలకు వీసాలు లేకుండా శ్రీలంక ఫ్రీ ఎంట్రీ

కొలంబో: శ్రీలంక (Sri lanka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని (Tourism industry) మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఏడు దేశాల టూరిస్టులకు వీసాలు లేకుండా పర్యటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడు దేశాల్లో ఇండియా, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించగా, ఈ నిర్ణయం వచ్చే ఏడాది మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది. రాబోయే కాలంలో శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య 50 లక్షలకు పెరుగుతుందని ఆదేశం అంచనాగా ఉంది.


వీసాలు లేకుండా పర్యటక ప్రదేశాలు చూసేందుకు ఏడు దేశాల టూరిస్టులకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అలీ సబ్రీ ఓ ట్వీట్‌లో తెలియజేశారు. ఐలాండ్ దేశమైన శ్రీలంక ప్రధానంగా పర్యాటకరంగంపై ఆధారపడుతోంది. దేశ జీడీపీలో పర్యాటక పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో కోవిడ్ మహమ్మారి, దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం, వ్యవసాయ సంస్కరణలు సక్రమంగా అమలు కాకపోవడం వంటి వరుస సమస్యలు శ్రీలంకను చుట్టుముట్టాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసరాలైన ఆహారం, ఔషధాలు, వంటగ్యాస్, ఇంధనం, టాయెలెట్ పేపర్, చివరకు అగ్గిపెట్టెల వరకూ తీవ్ర కొరత తలెత్తింది. ఇంధనం, వంట గ్యాస్‌ కోసం స్టోర్ల వద్ద గంటల గంటలు క్యూల్లో సామాన్య ప్రజానీకం నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో తిరిగి పర్యాటకానికి జీవం పోయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించి గత క్యాబినెట్‌లో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించింది. ఏడు దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్‌ను అనుమతించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-10-24T15:54:04+05:30 IST