Share News

Chennai: రేబిస్ సోకిన వీధి కుక్క స్వైర విహారం.. 29 మందిని కరిచి.. చివరికి బలై..

ABN , First Publish Date - 2023-11-25T15:46:06+05:30 IST

రేబిస్ సోకిన వీధి కుక్క(stray dog) చెన్నైలోని ఓ కాలనీ ప్రజల్ని బెంబేలెత్తించింది. అతి కష్టంమీద దాన్ని పట్టుకుని స్థానికులు చంపేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రోయపురం ప్రాంతంలోని పాదచారులపై ఓ శునకం దాడి చేసింది.

Chennai: రేబిస్ సోకిన వీధి కుక్క స్వైర విహారం.. 29 మందిని కరిచి.. చివరికి బలై..

చెన్నై: రేబిస్ సోకిన వీధి కుక్క(stray dog) చెన్నైలోని ఓ కాలనీ ప్రజల్ని బెంబేలెత్తించింది. అతి కష్టంమీద దాన్ని పట్టుకుని స్థానికులు చంపేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రోయపురం ప్రాంతంలో పాదచారులపై శునకం దాడి చేసింది. స్థానికుల పాదాలు, చీలమండలను కొరికింది. తరిమి కొట్టడానికి ప్రయత్నించినా గంటసేపు చిక్కకుండా తప్పించుకుంది.

దాడిలో 29 మంది గాయపడ్డారు. అతి కష్టం మీద స్థానికులు కుక్కను బంధించి చంపేశారు. కళేబరాన్ని మద్రాస్ వెటర్నరీ కాలేజీకి (Madras Veterinary College) పంపారు. కుక్క(Dog Bite) శాంపిల్స్ పరిశోధించిన వైద్యులు రేబిస్ సోకినట్లుగా నిర్ధారించారు.

గాయపడిన వారందరికి అదే రాత్రి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి రేబిస్(Rabies) వ్యాక్సిన్ వేశారు. మరో నాలుగు వారాలు వారు రేబిస్ ఇంజక్షన్ తీసుకోవాలని డాక్టర్లు తెలిపారు.


కుక్క కాటుకు గురైనవారిలో 10 మంది పిల్లలు ఉన్నారని.. కొంతమంది వృద్ధులు పారిపోతుండగా పడిపోవడంతో వారి తలలకు గాయాలైనట్లు తెలుస్తోంది. 24 మంది తీవ్రంగా గాయపడినట్లు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమీషనర్ జె రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఘటన తర్వాత అధికారులు ఆ ప్రాంతంలో 52 కుక్కలను పట్టుకుని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. "మేం నవంబర్ 27 నుండి కుక్కల గణనకు వెళ్తున్నాం.

కుక్కలన్నింటికీ టీకాలు వేయబోతున్నాం. ప్రతి సంవత్సరం 15,000-17,000 స్టెరిలైజేషన్లు చేస్తాం. రోయపురంలో 29 మందికి ఇమ్యునోగ్లోబులిన్లు ఇచ్చాం" అని రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ ఈ రోజు బాధిత కాలనీవాసుల భయాలను పోగొట్టడానికి ప్రయత్నించారు. చెన్నై అంతటా కుక్కలకు చెకప్ చేయిస్తామని హామీ ఇచ్చారు. మానవుల్లో రేబిస్ వ్యాధికి శునకాలు కారణమవుతాయి. లక్షణాలు కనిపించిన తరువాత కూడా చికిత్స చేయకపోతే వ్యాధి ప్రాణాంతకం కావచ్చు.

Updated Date - 2023-11-25T15:58:49+05:30 IST